ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలను అణచివేయడానికి ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు , ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ కు చెందినవారు, తమ కుటుంబాలకు సమాచారం అందించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరిహద్దుల్లోని ఇనుప కంచె దగ్గర నిలబడి, కొద్దిపాటి ఇంటర్నెట్ సిగ్నల్స్ కోసం ప్రయత్నిస్తూ, తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ సందేశాలు పంపారు. ఇరాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం, రాత్రి 8 గంటల తర్వాత కర్ఫ్యూ విధించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది.
జమ్మూ కశ్మీర్ ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ మోమిన్ ఖాన్ మాట్లాడుతూ.. విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం కోసం ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ‘తల్లిదండ్రులు తమ పిల్లలను నేరుగా సంప్రదించలేక ఆందోళన చెందారు... ఈ గ్రూప్ ద్వారా విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని వారికి భరోసా లభించింది’ అని ఆయన చెప్పారు. ఇరాన్‌లో సుమారు 9,000 మంది భారతీయులు, వీరిలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులు, ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ నుంచి వెళ్లినవారే. ఇరాన్‌లో ప్రస్తుత రాజకీయ అస్థిరత, ఉద్రిక్తతల నేపథ్యంలో అనేక విశ్వవిద్యాలయాలు తరగతులను, పరీక్షలను వాయిదా వేశాయి. దీంతో విద్యార్థులు తమ విద్యా ప్రణాళికలు, వ్యక్తిగత భద్రతపై అనిశ్చితితో ఉన్నారు.
అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. శనివారం తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో భారతీయ విద్యార్థులు, యాత్రికులు ఢిల్లీకి చేరుకున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నంత తీవ్రంగా పరిస్థితి లేదని, అయితే నిరసనలు, ఇంటర్నెట్ నిలిపివేతలు, కర్ఫ్యూ, విద్యాసంస్థల మూసివేతలు భయాన్ని పెంచాయని చాలా మంది తెలిపారు. తక్షణ ప్రమాదం కంటే అనిశ్చితి కారణంగానే తిరిగి రావాలని నిర్ణయించుకున్నామని చాలామంది చెప్పారు.
ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ పిల్లల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ‘ఇంటికి రావడం ఒక పెద్ద భారం దిగిపోయినట్లు అనిపించింది’" అని ఒక విద్యార్థి అన్నారు. అయితే, కొందరు విద్యార్థులు తమ కుటుంబాలకు ఆందోళన చెందవద్దని, అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం, మార్గదర్శకాలు కావాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో చివరి ఏడాది ఎంబీబీఎస్ చదువుతోన్న జమ్మూ కశ్మీర్‌కు చెందిన విద్యార్థిని జోహా సయీదా... అక్కడ జరుగుతున్న అల్లర్ల వార్తలు ఎక్కువగా పుకార్లేనని, తాము క్యాంపస్‌లో సురక్షితంగానే ఉన్నామని తెలిపారు. ‘ఎలాంటి గందరగోళం లేదు. పోలీసులు నిరంతరం గస్తీ తిరుగుతున్నారు, విశ్వవిద్యాలయం విద్యార్థులను బయటకు వెళ్లవద్దని సూచించింది. మేము సురక్షితంగా ఉన్నాం’ అని ఆమె చెప్పారు.
సయీదా 'తండ్రి మాట్లాడుతూ.. సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ఇంటర్నెట్ నిలిపివేయడం కుటుంబాల్లో ఆందోళనను పెంచిందని అన్నారు. ‘ముందు జాగ్రత్తగా ఇండియాకు వచ్చేయాలని పట్టుబట్టాం’ అని ఆయన చెప్పారు. పరిస్థితి చక్కబడిన తర్వాత జోహాను తిరిగి పంపే ఆలోచన ఉందని ఆయన తెలిపారు. చివరి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థి అదులాహద్ తండ్రి మాట్లాడుతూ, ‘అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని, తాను సురక్షితంగా ఉన్నానని మా కుమారుడు చెబుతున్నాడు. పరిస్థితి మరింత దిగజారితే లేదా వెళ్లిపోవాలని సలహా ఇస్తేనే అతను తిరిగి వస్తాడు’ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa