నా కుమార్తె బతికి ఉందో.. చనిపోయిందో చెప్పండి సారూ అంటూ ఓ దివ్యాంగుడు పోలీసులను వేడుకుంటున్న వార్త ఇటీవల సోషల్ మీడియాలోనూ, ప్రధాన మీడియా సైట్లలోనూ వచ్చిన సంగతి తెలిసిందే. తన కుమార్తె కనిపించడం లేదని.. పోలీసులకు ఫిర్యాదు చేసి, ఏడాదిగా వారి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని గుంటూరు జిల్లా ఆర్. అగ్రహారానికి చెందిన ఏసోబు అనే దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఏసోబు సోమవారం రోజున గ్రీవెన్స్‌లో డీఎస్పీ అరవింద్‌కు వినతి పత్రం కూడా సమర్పించారు.
2025 ఫిబ్రవరిలో ఇంటి నుంచి వెళ్లిపోయిన తన కుమార్తె ఇప్పటికీ కనిపించడం లేదని.. పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవటం లేదని ఏసోబు వాపోయారు. తన కుమార్తె ఆచూకీ అడుగుతుంటే మాటిమాటికి పోలీస్ స్టేషన్‌కు రావొద్దని అన్నారంటూ డీఎస్సీకి వినతి పత్రం అందించారు. తన కుమార్తె బతికుందా.. చనిపోయిందా అనేది చెప్పాలంటూ డీఎస్సీని వేడుకుంటూ కన్నీంటి పర్యంతమయ్యారు.
అయితే ఈ ఘటనపై తాజాగా గుంటూరు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. గుంటూరు ఈస్ట్ డీఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీసుల వెల్లడించిన వివరాలు ప్రకారం.. ఏసోబు. భార్య అంజలి, కుమార్తె టైస్సీతో కలిసి గుంటూరులోని నిమ్మలపేటలో నివసిస్తూ ఉండేవాడు. గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన ద్వారా జీవనం సాగించే ఏసోబు.. భార్య అంజలిని, కుమార్తె బ్లెస్సీ కూడా తనతో పాటు భిక్షాటన చేయాలంటూ ఒత్తిడి చేశాడు. దీనికి వారు అంగీకరించలేదు. ఫలితంగా కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే 2025 ఫిబ్రవరి ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అంజలి, తన కుమార్తె బ్లెస్సీతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఏసోబు తన భార్య, కుమార్తె అదృశ్యమయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై లాలాపేట పోలీస్ స్టేషన్లో 2025 ఏప్రిల్ 22వ తేదీ రాత్రి 08.00 గంటలకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అదృశ్యమైన మహిళ, బాలిక ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. 2025 మే 8వ తేదీన అంజలి స్వయంగా పోలీస్ స్టేషన్ వచ్చి, తన భర్త తనను, తన కుమార్తెను భిక్షాటన చేయమని ఒత్తిడి చేయడంతో.. కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు తెలియజేశారు. ప్రస్తుతం తన కుమార్తెను చక్కగా చూసుకుంటున్నానని తెలిపారు.
అలాగే తన భర్త ఏసోబు మరో మహిళను వివాహం చేసుకుని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ..మానసిక రుగ్మత ఉన్న వ్యక్తిగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులకు విన్నవించుకున్నారు. ఇక లాలాపేట పోలీసులు బాలిక బ్లెస్సీతో కూడా మాట్లాడగా, ఆమె కూడా ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. తండ్రితో కలిసి ఉండనని స్పష్టం చేసింది. దీంతో గుంటూరు జిల్లా ఈస్ట్ సబ్ డివిజన్ SDPO అనుమతితో 2025 జూన్ 30వ తేదీ ఈ కేసులోతదుపరి చర్యలను నిలిపివేసినట్లు పోలీసులు ప్రకటనలో వివరించారు.
ప్రస్తుతం బాలిక తన తల్లితో కలిసి తెలంగాణలో ఉంటోందని వెల్లడించారు. ఏసోబు పోలీసులపై చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమన్న గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్.. ఏదైనా వార్తను ప్రచురించే ముందు పోలీసుల నుంచి నిజానిజాలను నిర్ధారించుకోవాలని మీడియా సంస్థలకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa