అమెరికా సుంకాల నేపథ్యంలో భారత్- యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందం కీలక దశకు చేరుకున్న వేళ EUలో భాగం కాకపోయినా భారత్‌తో మరింత బలమైన ఆర్థిక సంబంధాలకు నార్వే మద్దతు తెలిపింది. ఈ ఒప్పందం చారిత్రాత్మక మైలురాయి అని, ఇది భారత్-నార్వే వాణిజ్య సంబంధాలకు కూడా ఊపునిస్తుందని నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనెర్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ లో నార్వే సభ్యదేశమని, భారత్‌తో ఇప్పటికే వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఉందని, ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని ఆమె వివరించారు.
ఈయూ నార్వేకి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాబట్టి, భారత్-ఐరోపా ఆర్థిక అనుసంధానం తమకు కూడా సానుకూల పరిణామమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాణిజ్య యుద్ధాలు, సంరక్షణవాదం నేపథ్యంలో నార్వే రాయబారి స్వేచ్ఛా వాణిజ్యానికి గట్టి మద్దతు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల భారత్, ఐరోపా దేశాలు ప్రభావితమయ్యాయని, అయితే నార్వే వంటి చిన్న, బహిరంగ ఆర్థిక వ్యవస్థలు స్వేచ్ఛా వాణిజ్యం వల్ల ఎంతో లబ్ధి పొందాయని ఆమె అన్నారు.
‘మేము నియమాల ఆధారిత బహుపాక్షిక వ్యవస్థను, వాణిజ్య అడ్డంకులను తొలగింపులను విశ్వసిస్తాం, వాటిని పెంచడాన్ని కాదు’ అని ఆమె నొక్కి చెప్పారు. ప్రపంచ అనిశ్చితికి సంరక్షణవాదం సమాధానం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో నోబెల్ శాంతి బహుమతుల విజేతల ఎంపికలో నార్వే ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని రాయబారి స్పష్టం చేశారు. ‘నార్వేజియన్ నోబెల్ కమిటీ ఒక స్వతంత్ర సంస్థ. ఈ నిర్ణయాలు నార్వే ప్రభుత్వం లేదా మరే ఇతర అధికారం జోక్యం లేకుండానే జరుగుతాయి’ అని ఆమె తెలిపారు. ఈ బహుమతి అంతర్జాతీయ, స్వతంత్ర గౌరవంగానే ఉండాలని ఆమె అన్నారు.
గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా నాయకత్వం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆ దీవి డెన్మార్క్‌లో భాగమని, దాని సార్వభౌమాధికారానికి నార్వే మద్దతిస్తుందని ఆమె పునరుద్ఘాటించారు. నాటో వ్యవస్థాపక సభ్యురాలిగా, ఆర్కిటిక్ భద్రతపైనే నార్వే దృష్టి సారిస్తుందని ఆమె తేల్చిచెప్పారు.
భారత్ నిర్వహించే ఏఐ సమ్మిట్‌లో నార్వే పాల్గొంటుందని తెలిపారు. ఈ సమ్మిట్ నిర్వహణతో ‘AIని ప్రజాస్వామ్యీకరించడం’ అనే లక్ష్యానికి నార్వే గట్టి మద్దతు ఇస్తుందని ఆమె ధ్రువీకరించారు. ఈ కార్యక్రమంలో నార్వే డిజిటలైజేషన్ మంత్రి, కీలక వ్యాపారవేత్తలతో కూడిన బృందాన్ని పంపుతారని, ఇది భారత్‌తో సాంకేతిక సహకారాన్ని పెంచుకోవాలనే ఆసక్తిని సూచిస్తుందని ఆమె చెప్పారు.
గాజా విషయంలో ట్రంప్ ప్రతిపాదించిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’పై నార్వే ఆహ్వానం అందుకున్నప్పటికీ, ఐక్యరాజ్యసమితితో ఈ యంత్రాంగం ఎలా అనుసంధానం అవుతుందనే దానిపై సందేహాలు లేవనెత్తినట్లు ఆమె తెలిపారు. ‘మేము దావోస్‌లో సంతకం చేసే కార్యక్రమంలో చేరలేదు. ఇది ఐరాస నిబంధనలతో ఎలా సరిపోతుందో అర్థం చేసుకోవడం మాకు ముఖ్యం’ అని ఆమె అన్నారు. గాజాలో శాంతి స్థాపనకు, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు నార్వే మద్దతిస్తుందని ఆమె పునరుద్ఘాటించారు.
భారత్-నార్వే సంబంధాలు కొత్త వాణిజ్య ఒప్పందం , ఇరువైపులా పెరుగుతున్న వ్యాపార ఆసక్తితో సానుకూల, స్థిరమైన మార్గంలో పయనిస్తున్నాయని రాయబారి తెలిపారు. ఈ ఏడాది చివరలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్-నార్డిక్ సమ్మిట్ కోసం నార్వేను సందర్శించే అవకాశం ఉందని, ఇది ప్రపంచ అనిశ్చితి మధ్య ఢిల్లీ, ఓస్లో మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక, ఆర్థిక బంధాలను సూచిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa