దావోస్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక ఫోరమ్ సదస్సులో జనవరి 22న ‘శాంతి బోర్డు’ అనే కొత్త కార్యక్రమాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. మొదట్లో గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ, పునర్నిర్మాణం పర్యవేక్షణకు 2025లో ప్రతిపాదించిన ఈ బోర్డు, ఇప్పుడు ప్రపంచవ్యాప్త సంఘర్షణలను పరిష్కరించడానికి విస్తరించింది. ఈ శాంతి బోర్డు ఛార్టర్‌పై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఇతర ప్రపంచ నాయకులతో కలిసి సంతకం చేశారు. పాలస్తీనియన్లకు శాశ్వత కాల్పుల విరమణ, మానవతా సహాయాన్ని పెంచడానికి తమ భాగస్వామ్యం దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, 2020లో ట్రంప్ ప్రతిపాదించిన ‘పీస్ టు ప్రాస్పెరిటీ’ పశ్చిమాసియా ప్రణాళికను అప్పట్లో పాకిస్థాన్ ప్రతిపక్ష నేతగా ఉన్న షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘శాంతి ప్రణాళిక’ను "అన్యాయమైంది, పక్షపాతంతో కూడుకున్నది, అణచివేతతో కూడుకున్నది’ అని ఆయన ఆరోపించారు. పాలస్తీనియన్లు దానిని వ్యతిరేకించారని కూడా అన్నారు. జనవరి 29, 2020న, షరీఫ్ ఎక్స్ (ట్విట్టర్)లో ‘అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా శాంతి ప్రణాళిక, జెరూసలేంపై ఇజ్రాయెల్ ఆక్రమణను, పాలస్తీనియన్ల భూమిపై అక్రమ స్థావరాలను చట్టబద్ధం చేస్తుంది’ అని పోస్ట్ పెట్టారు.
‘బోర్డ్ ఆఫ్ పీస్’లో పాకిస్థాన్ చేరాలనే నిర్ణయం దేశంలో తీవ్ర విమర్శలకు దారితీసింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ‘పాక్ ప్రభుత్వం 'బోర్డ్ ఆఫ్ పీస్'లో చేరడాన్ని 'పీటీఐ అంగీకరించదు’ అని ఆ పార్టీ పేర్కొంది. ఇలాంటి అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన నిర్ణయాలు పూర్తి పారదర్శకత, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో సంప్రదింపుల తర్వాతే తీసుకోవాలని పీటీఐ నొక్కి చెప్పింది.
పాకిస్థానీ జర్నలిస్ట్, రచయిత జాహిద్ హుస్సేన్ దీనిపై ఘాటుగానే స్పందించారు. ‘దేశం కేవలం ట్రంప్ మంచి పుస్తకాలలో ఉండాలనుకుంటుందా?’ అని ప్రశ్నించారు. ఇది పాకిస్థాన్‌కు ‘అత్యంత వినాశకరమైన చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. రచయిత, కార్యకర్త ఫాతిమా భుట్టో ‘పాలస్తీనియన్ల మారణహోమానికి కారకులైనవారితో పాకిస్థాన్ కూర్చుంటుందా? ఎంత అవమానం’ అని అన్నారు.
మరో హక్కుల కార్యకర్త అమ్మర్ అలీ జాన్.. ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే దీనిపై మీడియాలో గానీ, పార్లమెంట్‌లో గానీ చర్చ జరగలేదని ఆయన అన్నారు. ‘ట్రంప్ అస్థిరమైన నిర్ణయాలకు ప్రపంచం దిగ్భ్రాంతి చెందుతున్న సమయంలో, పాలస్తీనా ఆక్రమణను కొనసాగించడానికి ఒక వలసవాద ఏర్పాటు చేసిన'బోర్డ్ ఆఫ్ పీస్'లో చేరాలని పాకిస్థాన్ ఎంచుకుంది’ అని ఆయన దుయ్యబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa