ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలాష్ ముచ్చల్ మరో అమ్మాయితో ,,,.. స్మృతి మంధాన స్నేహితుడి సంచలన ఆరోపణలు

sports |  Suryaa Desk  | Published : Sat, Jan 24, 2026, 10:24 PM

భారత క్రికెటర్ స్మృతి మంధాన , సింగర్ & సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ల వివాహం రద్దయిన సంగతి తెలిసిందే. ముహుర్తానికి కొద్ది గంటల ముందు పెళ్లి రద్దు కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా జరగడానికి పలాష్ ముచ్చల్ తీరే కారణమని అప్పట్లో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే పెళ్లి రద్దు ప్రకటన సమయంలో స్మృతి మంధాన.. పలాష్‌పై ఎలాంటి ఆరోపణలు చేయకుండా హుందాగా స్పందించారు. అయితే ఈ పెళ్లి రద్దు వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.


స్మృతి మంధాన చిన్న నాటి స్నేహితుడు, నటుడు-నిర్మాత విద్యాన్ మానే చేసిన ఆరోపణలు ఈ వివాదాన్ని తీవ్రతరం చేశాయి. ముచ్చల్‌పై వ్యభిచారం, ఆర్థిక మోసం ఆరోపణలు చేసిన మానే.. విడుదల కాని సినిమా ప్రాజెక్టులో రూ. 40 లక్షలకు పైగా మోసపోయానన్నారు. ఈ మేరకు మహారాష్ట్రలోని సంగ్లీలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. స్మృతి, ముచ్చల్‌ల వివాహం నవంబర్ 23, 2025న జరగాల్సి ఉంది. కానీ క్రికెటర్ తండ్రి హాస్పిటల్ పాలయ్యారనే కారణంతో వివాహాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత డిసెంబర్ 2025లో పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.


హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మానే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాడి నవంబర్‌లో జరిగిన వివాహ వేడుకల సమయంలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన తర్వాత స్మృతి, ముచ్చల్‌ల బంధం దెబ్బతిందని ఆయన చెప్పారు.. “నవంబర్ 23న జరిగిన వివాహ వేడుకల్లో నేను ఉన్నప్పుడు, పలాష్ మరో మహిళతో మంచంపై రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. భయంకరమైన దృశ్యం అది, భారత మహిళా క్రికెటర్లు అతణ్ని కొట్టారు. అతడి కుటుంబం మొత్తం దొంగలే. పలాష్ పెళ్లి చేసుకుని సంగ్లీలో స్థిరపడతాడని నేను అనుకున్నాను, కానీ అది పూర్తిగా బెడిసికొట్టింది” అని మానే పేర్కొన్నారు. తాను, స్మృతి మంధాన బాల్య స్నేహితులమని, ఆమె కుటుంబం ద్వారా ముచ్చల్ పరిచయం అయ్యాడని మానే తెలిపారు.


ముచ్చల్ కుటుంబంపై మానే ఆర్థిక ఒత్తిడి ఆరోపణలు చేశారు. నిలిచిపోయిన సినిమా ప్రాజెక్టులో అదనపు డబ్బు పెట్టుబడి పెట్టాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన చెప్పారు. “గత నెలలో పలాష్ ముచ్చల్ తల్లి (అమితా ముచ్చల్)ని కలిసినప్పుడు.. సినిమా విడుదల బడ్జెట్ ఇప్పుడు రూ. 1.5 కోట్లకు పెరిగిందని ఆమె చెప్పారు. మరో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టాలని నన్ను అడిగారు, లేదంటే నాకు డబ్బు తిరిగి రాదని చెప్పారు. నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. నన్ను సినిమా నుంచి బయటకు గెంటేస్తామని బెదిరించారు, దీంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది” అని ఆయన అన్నారు.


వివాహం రద్దు అయిన తర్వాత పలాష్ కుటుంబంతో కమ్యూనికేషన్ పూర్తిగా ఆగిపోయిందని మానే చెప్పారు. “నా ఫ్రెండ్‌తో పలాష్ వివాహం రద్దయిన తర్వాత, అతడి కుటుంబం నన్ను అన్ని విధాలా బ్లాక్ చేసింది. సినిమాలో నటించిన ఇతర ఆర్టిస్టులకు కూడా వారికి రెమ్యునరేషన్ ఇవ్వలేదని నాకు తెలిసింది. సినీ పరిశ్రమలో దర్శకులు నిర్మాతలను దోచుకోవడం గురించి నేను విన్నాను, కానీ ఇది పూర్తి దొంగతనం” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.


తాను చేస్తున్న ఆరోపణలు నిజమని రుజువు చేసేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని మానే చెప్పారు. “నా చాట్స్, ఫోన్ సంభాషణలతో సహా అన్ని ఆధారాలను నేను సేవ్ చేసుకున్నాను, వాటిని పోలీసులకు, మీడియాకు పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయన చెప్పారు.


మానే చేసిన ఆరోపణలను పలాష్ ముచ్చల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఖండించారు. “సంగ్లీకి చెందిన విజ్ఞాన్ మానే నాకు వ్యతిరేకంగా చేసిన ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, వాస్తవ విరుద్ధమైనవి. నా ప్రతిష్టను దెబ్బతీసే దురుద్దేశంతో ఆయన ఆరోపణలు చేశారు. వాటిని సవాల్ చేయకుండా వదిలిపెట్టను. నా లాయర్ శ్రేయాంష్ మితారే, అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు” అని ముచ్చల్ తన పోస్టులో రాశారు.


స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు చేసుకోవడానికి గల కారణాలు ఇవంటూ.. ఊహాగానాలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇరు పక్షాలు తర్వాత విడివిడిగా ప్రకటనలు విడుదల చేసి వివాహం రద్దు వార్తలను ధృవీకరించాయి. “వివాహం రద్దయ్యిందని స్పష్టం చేయాలని కోరుకుంటున్నాను, గోప్యతను కోరుతున్నాన’’ని మంధాన పేర్కొంది. “నేను నా జీవితంలో ముందుకు సాగాలని, నా వ్యక్తిగత సంబంధం నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నాకు అత్యంత పవిత్రమైన దాని గురించి నిరాధారమైన పుకార్లపై ప్రజలు ఇంత సులభంగా స్పందించడం చూడటం నాకు చాలా కష్టంగా ఉంది. ఇది నా జీవితంలో అత్యంత కష్టమైన దశ, నేను నా నమ్మకాలను పట్టుకుని, దానిని గౌరవంగా ఎదుర్కొంటాను.” అని పలాష్ కూడా పోస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa