ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేపల గుడ్లు తినడంవల్ల మీ గుండె బలంగా మారుతుంది

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Jan 24, 2026, 11:29 PM

మాంసాహారులు చికెన్, మటన్, చేపల్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. చికెన్, మటన్, చేపలు ఈ మూడింటిని ఓ పట్టు పడుతుంటారు. అయితే, ఈ మూడింటిలో చేపల్ని తినడం వల్ల శరీరానికి ఎక్కువగా పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చేపల్లో ఎన్నో రకాలు ఉంటాయి. వాటిని తింటే ఆరోగ్యం చాలా మెరుగపడుతుంది. సరిగ్గా తీసుకుంటే గుండె, మెదడు ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.


ఇక చేపల్ని తినేవారికి వాటి గుడ్లు గురించి కూడా తెలిసి ఉంటుంది. చేపలు మాదిరిగానే వాటి గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చేపల గుడ్డుల్ని సొన లేదా చనా లేదా రో అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. చేపల గుడ్డుల్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి డాక్టర్ సంతోష్ జాకబ్ వివరించారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేపలు గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, వాటిని ఎలా వండుకుంటే శరీరానికి మంచిదని తెలిపారు. ఆ పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.


చేపల గుడ్లలో పోషకాలు మెండు


చేపల మాదిరిగానే వాటి గుడ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, సెలీనియం, విటమిన్ బి12, విటమిన్ డి, ఫాస్ఫరస్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. ఇందులో తగిన మొత్తం ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఈ చేపల గుడ్లను పోషకాల శక్తి కేంద్రంగా పరిగణిస్తారు నిపుణులు. సాల్మన్, ట్రౌట్, కాపెలిన్, రోహు, హిల్సా, బంగారు తీగ చేపల గుడ్లు తింటే మంచిదని నిపుణులు అంటున్నారు. ఈ చేపల గుడ్లలో పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని సరిగ్గా తింటే ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. అవేంటంటే..


గుండె ఆరోగ్యానికి మేలు


చేప గుడ్లలో మూడు రకాల కొవ్వులు తక్కువ మొత్తంలో ఉంటాయి. సంతృప్త, అసంతృప్త, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు తక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్‌ని ప్రోత్సహిస్తాయి.


ఇది ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థను నిర్వహించడానికి సాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అవి రక్తం గడ్డకట్టడం, వాపును తగ్గించడంలో సాయపడతాయి. అవి రక్త నాళాలను విస్తరించడానికి, రక్తపోటును తగ్గించడానికి సాయపడతాయి.


రుమాటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం


చేపలు, చేప గుడ్లలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో సాయపడతాయని డాక్టర్ అంటున్నారు. ఒమేగా-3 అధికంగా ఉండే చేప గుడ్లు శోథ నిరోధక లక్షణాల్ని కలిగి ఉంటాయి.


ఇవి ఇన్ఫ్లమేషన్ స్థాయిల్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. శరీరంలో మంట, వాపు నుంచి రిలీఫ్ లభిస్తుంది. అంతేకాకుండా ఎముకల్ని బలంగా మార్చడంలో సాయపడతాయి.


కంటి చూపును మెరుగుపరుస్తాయి


శిశువుల్లో దృష్టి అభివృద్ధికి, పిల్లలు, పెద్దల్లో రెటీనా పనితీరుకు DHA, EPA ముఖ్యమైనవి. ఆహారంలో తగినంత ఒమేగా-3లు తీసుకోని వ్యక్తులు డయాబెటిక్ రెటినోపతి, వయస్సు సంబంధిత మాక్యులర్ డీజెనరేషన్, డ్రై ఐ సిండ్రోమ్ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. చేపల గుడ్లు తినడం వల్ల ఈ ప్రమాదాలు తగ్గుతాయి. మీరు మాంసాహారం తింటుంటే, చేపల గుడ్లు తప్పకుండా తినాలని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు.


ఇతర ప్రయోజనాలు


చేపల గుడ్లలో ఉండే విటమిన్ బి12, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును పెంచుతాయి. నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మతిమరుపు, జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా అల్జీమర్స్ వ్యాధిని ఎక్కువ కాలం నివారించాలనుకుంటే చేపల గుడ్లను తినాలని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు.


చేప గుడ్లలో సెలీనియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వివిధ ఇన్ఫెక్షన్లు, చిన్న అనారోగ్యాల నుంచి రక్షించుకోవడంలో సాయపడతాయి.


ఇందులో ఉండే ఒమేగా -3 ఆమ్లాలు, జింక్, విటమిన్ ఈ చర్మ, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మానికి తగినంత మెరుపును ఇస్తాయి. జుట్టు బలంగా ఉండటానికి సాయపడతాయి.


అసలు చేపల గుడ్లను ఎలా వండుకోవాలి?


చేపల గుడ్లను డీప్ ఫ్రై చేసి వండుకోకూడదని డాక్టర్ సంతోష్ జాకబ్ సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల చేపల గుడ్లలో ఉండే పోషకాలన్నీ తగ్గుతాయి. డీప్ ఫ్రై చేయడం వల్ల అనారోగ్యకరమైన కొవ్వులు చేరతాయి. అంతేకాకుండా ఎంతో ముఖ్యమైన ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ నశిస్తాయని డాక్టర్ అంటున్నారు.


లైట్ మసాలాలు, సుగంధ ద్రవ్యాలతో ఆవిరి మీద ఉడికించాలని సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా ఎగ్ వైట్‌తో కలిపి వీటిని ఆమ్లెట్‌గా వేసుకోవచ్చు. తక్కువ నూనెను ఉపయోగించి పాన్ మీద ఫ్రై చేసుకోండి. అయితే, ఓ విషయం గుర్తించుకోండి. మీకు యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటే మాత్రం నెలకు ఒకటి నుంచి రెండు సార్లు మాత్రమే తినాలని సిఫార్స్ చేస్తున్నారు. వీటిని ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్‌తో కలిపి తినాలని సూచిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa