ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 2026లో స్థానాన్ని సాధించిన స్కాట్లాండ్

sports |  Suryaa Desk  | Published : Sun, Jan 25, 2026, 03:19 PM

స్కాట్లాండ్ క్రికెట్ జట్టుకు జాక్‌పాట్ తగిలింది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో ఆడాలంటూ ఐసీసీ అధికారికంగా స్కాట్లాండ్ జట్టును ఆహ్వానించింది. ఈ బంపర్ ఆఫర్ కు స్కాట్లాండ్ వెంటనే ఆమోదం తెలిపింది. అంతేకాదు, ఆ జట్టు హుటాహుటీన భారత్‌కు బయలుదేరనుంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2009లో రాజకీయ కారణాలతో జింబాబ్వే తప్పుకోవడంతో అప్పుడు కూడా స్కాట్లాండ్‌కే ప్రపంచకప్‌లో ఆడే అవకాశం దక్కింది. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశమే వారి తలుపు తట్టింది.ఈ మార్పుతో స్కాట్లాండ్ జట్టు గ్రూప్-సిలో చేరింది. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, ఇటలీ, నేపాల్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. స్కాట్లాండ్ తన మూడు మ్యాచ్‌లను కోల్‌కతాలో, ఒక మ్యాచ్‌ను ముంబైలో ఆడనుంది. వాస్తవానికి, ప్రపంచకప్‌కు అర్హత సాధించని జట్లలో స్కాట్లాండ్ (14) మెరుగైన ర్యాంకులో ఉంది. అందుకే ఐసీసీ నుంచి వారికి ఈ పిలుపు వచ్చింది. ఈ పరిణామంపై క్రికెట్ స్కాట్లాండ్ చైర్ విల్ఫ్ వాల్ష్ స్పందిస్తూ, "ఐసీసీ చైర్మన్ జై షా ఈరోజు నాకు ఫోన్ చేసి టీ20 ప్రపంచకప్‌లో ఆడాల్సిందిగా ఆహ్వానించారు. మా జట్టు తరఫున ఈ ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించాను. మా ఆటగాళ్లు ఈ మెగా టోర్నీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశం కల్పించిన ఐసీసీకి ధన్యవాదాలు" అని ఓ ప్రకటనలో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa