ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. భూ హక్కుల సంస్కరణలు దేశ ఆర్థిక అభివృద్ధికి కీలకమని పేర్కొంటూ, ఈ అంశాన్ని జాతీయ ప్రాధాన్యతగా పరిగణించాలని ఆయన కోరారు.లేఖలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, భగవద్గీతలోని “కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” శ్లోకాన్ని ప్రస్తావించారు. మీరు చేపట్టిన పాలన దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని, ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదగడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి ప్రతిష్టాత్మక పథకాల ద్వారా భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా మీరు చూపుతున్న దూరదృష్టి ప్రశంసనీయమని తెలిపారు. అలాగే ‘ఫస్ట్ డెవలప్ ఇండియా (FDI)’ భావనను సృజనాత్మకంగా పునర్నిర్మించడం ద్వారా దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని అన్నారు.ఈ లక్ష్యాల సాధనలో భాగంగా 2020 ఏప్రిల్ 24న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘స్వామిత్వ’ పథకం చారిత్రక కార్యక్రమమని ధర్మాన పేర్కొన్నారు. రూ.566.23 కోట్ల బడ్జెట్తో 1.61 లక్షల గ్రామాల్లో 2.42 కోట్ల ఆస్తి కార్డుల పంపిణీ, 3.20 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే విజయవంతంగా పూర్తయ్యాయని గుర్తు చేశారు. జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం దేశంలో భూ వివాదాల తగ్గింపుకు కీలకమైందని తెలిపారు.భూ రికార్డుల ఆధునీకరణతో దేశీయ, విదేశీ పెట్టుబడులు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించి, నీతి అయోగ్ ద్వారా ముసాయిదా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించి రాష్ట్రాలకు పంపించిందని వివరించారు. భావనాత్మక హక్కుల స్థానంలో ‘నిర్ధారిత హక్కు’ వ్యవస్థను తీసుకురావడం ద్వారా వివాదరహిత భూ యాజమాన్యాన్ని నెలకొల్పడమే ఈ చట్టం లక్ష్యమని తెలిపారు.ఈ దార్శనికతకు అనుగుణంగా, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో AP Land Titling Act, 2023 (Act 27 of 2023) ను 31 అక్టోబర్ 2023న అమల్లోకి తీసుకువచ్చారని ధర్మాన గుర్తు చేశారు. అయితే 2024లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వరల్డ్ బ్యాంక్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ సర్వేలో భూ సంబంధిత అంశాల్లో భారత్ వెనుకబడి ఉన్న వాస్తవాన్ని విస్మరించారని విమర్శించారు.ప్రస్తుతం దేశంలో కేవలం 12 రాష్ట్రాలు మాత్రమే నీతి అయోగ్ సూచించిన ముసాయిదా బిల్లును చట్టంగా మార్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని పేర్కొంటూ, అన్ని రాష్ట్రాలు ప్రభుత్వమే భూ హక్కుకు గ్యారెంటీ ఇచ్చే టారెన్స్ విధానం ఆధారిత ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa