ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్-8లో స్థానాన్ని సాధించిన న్యూజిలాండ్

sports |  Suryaa Desk  | Published : Tue, Feb 17, 2026, 04:00 PM

టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో సూపర్-8 దశలోకి ప్రవేశించింది. మంగళవారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి తమ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కివీస్ సునాయాసంగా గెలుపొందింది.చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెనడా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యువరాజ్ సమ్రా (65 బంతుల్లో 110) అద్భుత సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతనికి కెప్టెన్ దిల్‌ప్రీత్ బాజ్వా (36) నుంచి మంచి సహకారం లభించడంతో కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 30 పరుగులకే టిమ్ సీఫెర్ట్ (6), ఫిన్ అలెన్ (21) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (36 బంతుల్లో 76 నాటౌట్), రచిన్ రవీంద్ర (39 బంతుల్లో 59 నాటౌట్) కెనడా బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 146 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో న్యూజిలాండ్ కేవలం 15.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో కివీస్ జట్టు గ్రూప్-డి నుంచి సూపర్-8కు అర్హత సాధించింది. ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే దక్షిణాఫ్రికా సూపర్-8 చేరడం తెలిసిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa