ఆవు పేడ, ఆవు మూత్రం వంటి వాటతో మందులు, ఔషధాలు తయారు చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మానవ మలంతోనూ మందులు తయారు చేస్తారని.. దీనితోనే అనేక రోగాలకు చికిత్స కూడా చేశారని శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా 1900 ఏల్ల క్రితం రోమన్లు ఈ పని చేసినట్లు వెల్లడించారు. పశ్చిమ టర్కీలో లభించిన ఒక చిన్న గాజు సీసాలోని అవశేషాలను పరీక్షించగా ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
టర్కీలోని శివాస్ కుంహురియెట్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త సెంకర్ అతిలా, బెర్గామా మ్యూజియం స్టోరేజ్ రూమ్లో పరిశోధనలు చేస్తుండగా ఒక చిన్న గాజు సీసా ఆయన కంటపడింది. దీనిని 'అంగుయెంటేరియం' అని పిలుస్తారు. సాధారణంగా ఇలాంటి చిన్న పాత్రలను ఆ కాలంలో పరిమళ ద్రవ్యాలు లేదా మందులను నిల్వ చేయడానికి వాడేవారు. అయితే ఈ సీసా పురాతన నగరమైన పెర్గామన్లోని ఒక సమాధి నుంచి సేకరించినట్లు గుర్తించారు. ఈ నగరం క్రీస్తుశకం రెండు, మూడు శతాబ్దాల్లో ఓ ప్రముఖ వైద్య కేంద్రంగా విరాజిల్లేది.
దుర్వాసన లేని గోధుమ రంగు పదార్థం
ఆ సీసాను తెరిచినప్పుడు అందులో ముదురు గోధుమ రంగులో ఉన్న కొన్ని ముక్కలు కనిపించాయి. ఆశ్చర్యకరంగా.. వేల ఏళ్లు గడిచినా ఆ బాటిల్ నుంచి ఎలాంటి దుర్వాసన రాలేదు. దీంతో పరిశోధకులు ఆ పదార్థాన్ని అధునాతన 'గ్యాస్ క్రోమాటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ' సాంకేతికతతో విశ్లేషించారు. ఈ పరీక్షలో ఆ పదార్థం మానవ మలం అని నిర్ధారించే బయోమార్కర్లు లభించాయి. అంతేకాకుండా అందులో థైమ్ వంటి మూలికల్లో ఉండే 'కార్వాక్రోల్' అనే సుగంధ సమ్మేళనం కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
మానవ మలాన్ని థైమ్ మూలికలతో కలిపి తయారు చేసిన ఈ మిశ్రమం.. ప్రాచీన రోమన్ వైద్య గ్రంథాల్లో వివరించిన ఔషధాల ఫార్ములాతో సరిపోలింది. పాశ్చాత్య ఫార్మకాలజీ పితామహుడిగా పరిగణించబడే రోమన్ వైద్యుడు 'గాలెన్' తన రాతల్లో ఇలాంటి చికిత్సల గురించి ప్రస్తావించారు. మలం నుంచి వచ్చే చెడు వాసనను అణచివేయడానికి.. రోగులు దానిని సులభంగా తీసుకునేలా చేయడానికి సుగంధ ద్రవ్యాలను కలపాలని ఆయన సూచించేవారు. ఈ పరిశోధన ద్వారా గాలెన్ చెప్పిన పద్ధతులు కేవలం సిద్ధాంతాలు మాత్రమే కావని.. నిజ జీవితంలో రోగులపై ప్రయోగించేవారని స్పష్టమైంది.
ఏయే జబ్బులకు ఈ వింత చికిత్స?
1,900 ఏళ్ల క్రితం గ్రీకో, రోమన్ కాలంలో ఈ వింతైన ఔషధాన్ని రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు వాడేవారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు, శరీరంలో వచ్చే వాపులు, సంతానోత్పత్తి సమస్యల చికిత్సలో దీనిని ఉపయోగించేవారని అధ్యయనం వెల్లడించింది. నేటి ఆధునిక కాలంలో మనం అపరిశుభ్రమైనవిగా భావించే వ్యర్థాలను.. ఆ కాలంలో విలువైన ఔషధ దినుసులుగా పరిగణించడం విశేషం. 'జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్'లో ప్రచురితమైన ఈ అధ్యయనం పురాతన వైద్య చరిత్రపై కొత్త వెలుగులు ప్రసరింపజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa