ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బడ్జెట్ ఊతమిస్తుందన్న మంత్రి పయ్యావుల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 01, 2026, 07:11 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్, దేశాన్ని స్థిరమైన, బలమైన ఆర్థిక శక్తిగా ముందుకు నడిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దేశ ఆర్థిక పురోగతికి బాటలు వేసే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ బడ్జెట్ పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ, పేద, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. మొత్తమ్మీద, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా కేంద్ర బడ్జెట్ ఉందని కితాబిచ్చారు.ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసే పలు కీలక ప్రకటనలు ఉన్నాయని మంత్రి వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, బెంగళూరు-చెన్నై నగరాలను కలిపే మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల ద్వారా రాష్ట్రం ఆర్థికంగా లబ్ధి పొందుతుందని చెప్పారు. అలాగే, రూ.40,000 కోట్లతో ఇంటిగ్రల్ సెమీకండక్టర్ మిషన్ 2.0 పథకాన్ని విస్తరించడం ద్వారా రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు. వస్త్ర పరిశ్రమ కోసం టెక్స్‌టైల్ క్లస్టర్ల ఏర్పాటు, 2047 వరకు డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు వంటి నిర్ణయాలు ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తాయని తెలిపారు.కేంద్ర బడ్జెట్‌లో కొబ్బరి, కోకో, జీడిపప్పు వంటి వాణిజ్య పంటలకు ప్రోత్సాహం ఇవ్వడం రాష్ట్ర రైతులకు పెద్ద ఊరట అని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని రైతుల ఆదాయం పెరగడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణ పథకం కూడా రాష్ట్రానికి మేలు చేస్తుందని అన్నారు. పూర్వోదయ పథకం కింద భవిష్యత్తులో రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు దక్కుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa