అగ్రరాజ్యం అమెరికా మాజీ ప్రథమ మహిళ జిల్ బైడెన్ మాజీ భర్త విలియం స్టీవెన్సన్ (77) ఒక ఘోరమైన నేరంలో చిక్కుకున్నారు. తన ప్రస్తుత భార్య లిండా స్టీవెన్సన్ (64)ను దారుణంగా హత్య చేసిన ఆరోపణలపై ఆయన్ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. డెలావేర్ రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించడంతో.. అంతర్జాతీయ వ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే..?
విచారణాధికారుల కథనం ప్రకారం.. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో విల్మింగ్టన్లోని వీరి నివాసంలో భార్యాభర్తల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే సరికి లిండా స్టీవెన్సన్ లివింగ్ రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఆమెను రక్షించడానికి అత్యవసర వైద్య సిబ్బంది ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వారం రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన దర్యాప్తు అనంతరం.. మృతురాలి భర్త విలియమే ఆమెను హత్య చేశాడని అభియోగాలు మోపింది. ఆమెతో గొడవ పడ్డ ఆయన కోపంలో ఓ తుపాకీతో కాల్చి చంపారని ఆరోపించింది.
అయితే ఈ హత్యకు సంబంధించి సోమవారం విలియంను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ఈక్రమంలోనే ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లగా.. విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయన బెయిల్ పొందాలంటే 5 లక్షల డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 4.16 కోట్లు) చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఆ మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో ఆయన ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. నిందితుడి తరఫున వాదించడానికి న్యాయవాది ఉన్నారా లేదా అనే విషయంలో కూడా ఇంకా స్పష్టత రాలేదు.
జిల్ బైడెన్‌తో ఈయనకు పెళ్లి ఎప్పుడైంది?
విలియం స్టీవెన్సన్ 1970వ దశకంలో జిల్ బైడెన్‌ను వివాహం చేసుకున్నారు. 1970 నుంచి 1975 వరకు వీరిద్దరూ దంపతులుగా ఉన్నారు. విడాకుల అనంతరం 1977లో జిల్ బైడెన్ అప్పటి సెనేటర్ జో బైడెన్‌ను వివాహం చేసుకున్నారు. జో బైడెన్ 2021 నుంచి 2025 వరకు అమెరికా అధ్యక్షుడిగా సేవలు అందించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా తన మాజీ భర్త అరెస్ట్ పై స్పందించడానికి జిల్ బైడెన్ నిరాకరించారు. ఆమె కార్యాలయం నుంచి వచ్చిన ఈమెయిల్లో "దీనిపై వ్యాఖ్యానించడానికి ఏమీ లేదు" అని పేర్కొన్నారు.
విలియం స్టీవెన్సన్ 1970లలో డెలావేర్లో 'స్టోన్ బెలూన్' అనే ప్రసిద్ధ సంగీత వేదికను స్థాపించి మంచి గుర్తింపు పొందారు. ఇక హతురాలు లిండా విషయానికి వస్తే.. ఆమె బుక్ కీపింగ్ వ్యాపారాన్ని నడిపేవారు. కుటుంబం పట్ల ఎంతో అనురాగంతో ఉండే తల్లిగా, అమ్మమ్మగా ఆమెకు మంచి పేరుంది. ఫిలడెల్ఫియా ఈగిల్స్ జట్టుకు ఆమె పెద్ద అభిమాని. విచారకరమైన విషయం ఏమిటంటే.. ఆమె చనిపోయిన తర్వాత విడుదలైన సంస్మరణ ప్రకటనలో ఆమె భర్త పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa