తమిళనాడు రాజకీయాల్లో భాషా వివాదం మరోసారి చిచ్చు రేపింది. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎం.ఆర్.కె. పన్నీర్ సెల్వం ఉత్తర భారత వలస కార్మికులపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తర భారతీయులకు కేవలం హిందీ మాత్రమే వచ్చిని.. వారికింకేది తెలియదని అన్నారు. అందుకే వారంతా ఇక్కడకు వచ్చి పానీపూరీలు అమ్ముకుని బతుకుతున్నారంటూ సంచలన కామెంట్లు చేశారు.
అక్కడితో ఆగకుండా మంత్రి పన్నీర్ సెల్వం.. ఉత్తర, దక్షిణ భారతీయుల మధ్య ఉన్న ఉపాధి వ్యత్యాసాలను భాషా కోణంలో వివరించారు. కేవలం హిందీ మాత్రమే నేర్చుకున్న ఉత్తర భారతీయులు ఉపాధి కోసం తమిళనాడుకు వలస వచ్చి హోటళ్లలో టేబుళ్లు శుభ్రం చేయడం, నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేయడం లేదా పానీపూరీ అమ్ముకోవడం వంటి పనులు మాత్రమే చేస్తున్నారన్నారు. వారికి ఉపాధి అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
అలాగే తమిళనాడు అనుసరిస్తున్న ద్విభాషా విధానాన్ని సమర్థిస్తూ.. "మా పిల్లలు తమిళంతో పాటు ఆంగ్లాన్ని కూడా అనర్గళంగా నేర్చుకుంటున్నారు. అందుకే వారు అమెరికా, లండన్ వంటి దేశాలకు వెళ్లి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. మా ద్విభాషా విధానం వల్ల తమిళ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు" అని పన్నీర్‌సెల్వం ధీమా వ్యక్తం చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 'నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ', త్రిభాషా సూత్రంపై డీఎంకే ప్రభుత్వం ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని సీఎం స్టాలిన్ సహా మంత్రులు అందరూ ఆరోపిస్తున్నారు. గతంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా "హిందీ అనేక ప్రాంతీయ భాషలను మింగేస్తోంది" అని విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి పన్నీర్ సెల్వం మాత్రం ఓ మెట్టు పైకెక్కి మరీ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అలాగే పరిశ్రమల శాఖ మంత్రి టి.ఆర్.బి. రాజా వంటి వారు కొంత సున్నితంగా స్పందించారు. తమిళనాడులో హిందీ మాట్లాడే వారిని తాము ఎప్పుడూ అడ్డుకోలేదని, జర్మనీ, జపాన్ వాసుల లాగే ఉత్తర భారతీయులు కూడా ఇక్కడ సంతోషంగా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. కాకపోతే తమిళ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలోనే స్పందిస్తూ.. ఏ భాషను ఎవరిపై రుద్దే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని.. కేవలం విద్యార్థులకు తమ భాషా మూలాలను పరిచయం చేయడమే లక్ష్యమని వివరణ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa