అమెరికా రాజకీయాల్లో మరోసారి జాత్యహంకార వివాదం ముదిరింది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాలను కించపరిచేలా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఒబామా దంపతులను కోతులుగా చిత్రీకరించిన ఈ వీడియోపై డెమొక్రాట్లు, పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని.. అత్యంత హేయమైన జాత్యహంకార ప్రవర్తన అని విమర్శకులు మండిపడుతున్నారు.
వీడియోలో అసలేముందంటే..?
ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఒక నిమిషం నిడివి గల వీడియోను పోస్ట్ చేశారు. 2020 ఎన్నికల్లో 'డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్' తన విజయాన్ని దొంగిలించిందనే పాత ఆరోపణలను ఈ వీడియోలో మళ్లీ ప్రస్తావించారు. అయితే వీడియో ముగింపులో ఒబామా దంపతుల ముఖాలను కోతుల శరీరాలకు తగిలించి ఒక సెకను పాటు చూపించారు. ఆ సమయంలో.. "ది లయన్ స్లీప్స్ టునైట్" అనే పాట ప్లే అవుతుండటం గమనార్హం. గతంలో కూడా ట్రంప్ కృత్రిమ మేధ సాయంతో ఒబామా జైలు దుస్తుల్లో ఉన్నట్లు వీడియోను పోస్ట్ చేశారు. అలాగే మరో నల్లజాతీయుడైన హకీమ్ జెఫ్రీస్‌ను వెటకారం చేస్తూ కూడా వీడియో పెట్టారు.
డెమొక్రాట్ల తీవ్ర ఆగ్రహం..
ట్రంప్ చర్యను కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తీవ్రంగా ఖండించారు. "ఇది అత్యంత అసహ్యకరమైన ప్రవర్తన. ప్రతి రిపబ్లికన్ నాయకుడు దీనిని ఖండించి తీరాలి" అని ఆయన డిమాండ్ చేశారు. ఒబామాకు సన్నిహితుడైన బెన్ రోడ్స్ స్పందిస్తూ.. ట్రంప్ అనుచరులను 'జాత్యహంకారులు'గా అభివర్ణించారు. భవిష్యత్తు తరాలు ఒబామాను ఒక గొప్ప నాయకుడిగా స్మరించుకుంటాయని, ట్రంప్‌ను మాత్రం చరిత్రలో ఒక మచ్చగా చూస్తాయని ఘాటుగా విమర్శించారు. అమెరికా చరిత్రలో తొలి నల్లజాతీయుడైన అధ్యక్షుడిని ఇలా కించపరచడం జాతి వివక్షను రెచ్చగొట్టడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
వైట్ హౌస్ సమర్థన: 'ఇదంతా ఫేక్'
ఈ వివాదంపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందిస్తూ ఘాటు ప్రకటన విడుదల చేశారు. ఇదంతా "ఫేక్ అవుట్రేజ్" (కృత్రిమ ఆగ్రహం) అని ఆమె కొట్టిపారేశారు. ఇంటర్నెట్లో వైరల్ అయిన ఒక మీమ్ వీడియోను ట్రంప్ షేర్ చేశారని.. అందులో ట్రంప్‌ను అడవికి రాజుగా, డెమొక్రాట్లను లయన్ కింగ్ పాత్రలుగా చూపించారని ఆమె వెనకేసుకొచ్చారు. అమెరికా ప్రజలకు ఉపయోగపడే నిజమైన అంశాలపై దృష్టి పెట్టాలని ఆమె మీడియాకు సూచించారు.
మరోవైపు ట్రంప్ కూడా దీనిపై స్పందిస్తూ.. ఈ వీడియోను తానిప్పుడు డిలీట్ చేసినట్లు వివరించారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో కీలక రాష్ట్రాల్లో ఓటింగ్ యంత్రాలను ఉద్దేశపూర్వకంగా టాంపరింగ్ చేశారని ఉందని, అందుకే తాను ఈ వీడియోను పోస్ట్ చేశానని చెప్పారు. అయితే చివరి వరకు వీడియో చూడలేదని, అందులో ఒబామా దంపతులను కోతులుగా చూపించినట్లుగా కూడా తనకు తెలియదన్నారు. కానీ విషయం తెలిసిన వెంటనే వీడియోను డిలీట్ చేశానని.. ఇందులో తన తప్పేమీ లేదని, ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa