శ్రీశైలంలో భక్తుల ఇబ్బందులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. శ్రీశైలంలో శివస్వాముల ఆందోళనను ప్రస్తావిస్తూ ప్రభుత్వ విధానాలపై జగన్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వం పాలనలో శివ మాలధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం బాధాకరమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడిపోతున్నారని ఆరోపించారు. భక్తితో, నమ్మకంతో ఒకప్పుడు తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళన, అనిశ్చితితో దేవాలయాలకు వస్తున్నారని.. దీనిని చూస్తే ఏపీలో పరిస్థితి అర్థమవుతుందన్నారు.
చంద్రబాబు పాలనలో వరుసగా జరుగుతున్న ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధ కలిగిస్తున్నాయన్న జగన్.. నివారించగలిగినవి అయినప్పటికీ, ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. దీంతో వ్యవస్థలపై భక్తుల విశ్వాసం సన్నగిల్లుతోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉందని జగన్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం కేవలం ప్రచార విన్యాసాలు, రొటీన్ సమీక్షలకే పరిమితమవుతోందని.. జవాబుదారీతనం, బాధ్యతనేవి లేకుండా పోయాయని విమర్శించారు.
శ్రీశైలంలో శివస్వాములపై పోలీసులు లాఠీచార్జ్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో ఘోర వైఫల్యం బయటపడిందని.. మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వచ్చే భక్తులకు ఇచ్చే సమయాన్ని కుదించారని జగన్ ఆరోపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదని.. క్యూలైన్ల నిర్వహణ దగ్గర నుంచి తాగునీటి సౌకర్యం వరకూ అన్నీ లోపించాయన్నారు, పిల్లాపాపలతో గుడికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో ఎదురు చూడాల్సి వచ్చిందంటూ జగన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ సీఎం, డిప్యూటీ సీఎంలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని... భక్తులను పోలీసులు లాఠీలతో కొట్టి తరిమేశారని జగన్ ఆరోపించారు.
ఈ క్రమంలోనే గతంలో జరిగిన పలు ఘటనలను జగన్ ప్రస్తావించారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవటాన్ని జగన్ ప్రస్తావించారు. అలాగే సింహాచలం చందనోత్సవం సమయంలో గోడకూలి ఏడుగురు చనిపోయారని.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు చనిపోయిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.
ఇన్ని ఘటనలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం భక్తులకు సరైన ఏర్పాట్లు చేయటంలో విఫలమైందని జగన్ ఆరోపించారు. భక్తులు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు, పవన్ కల్యాణ్ మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని జగన్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa