తప్పును ప్రశ్నించడానికి వయసుతో సంబంధం లేదని.. పౌర బాధ్యత ఉంటే ఎవరైనా సమాజంలో మార్పు తీసుకురావచ్చని కేరళకు చెందిన ఒక వృద్ధురాలు నిరూపించారు. కోజికోడ్‌లోని ఎరంజిపాలం జంక్షన్ వద్ద బుధవారం జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన ఒక ద్విచక్ర వాహనదారుడిని ఆమె అడ్డుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
అసలేం జరిగిందంటే..?
కోజికోడ్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఎరంజిపాలం జంక్షన్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సులు, ఇతర వాహనాలన్నీ సిగ్నల్ పడటంతో వేచి ఉన్నాయి. అయితే ఒక యువకుడు ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి తన స్కూటర్‌ను ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి.. పాదచారులకు ఆటంకం కలిగిస్తూ వేగంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న సుమారు 60 ఏళ్ల వృద్ధురాలు అతడిని గమనించింది. వెంటనే అతడికి ఎదురుగా వెళ్లి నిల్చుంది.
సదరు వాహనదారుడు ఆమెను పక్కకు తప్పుకోమని కోరినా.. ఆమె మాత్రం అక్కడి నుంచి కదలలేదు. అతను పక్క నుంచి తప్పించుకోవాలని చూసినా.. ఆమె తన కాళ్లు అడ్డుపెట్టి మరీ అతడిని నిలువరించింది. అంతటితో ఆగకుండా తన బ్యాగులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను తీసి ఆ స్కూటర్ నంబర్ ప్లేట్‌ను ఫోటో తీయడం మొదలు పెట్టింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తుందనే భయంతో ఆ యువకుడు చేసేదేమీ లేక.. తన స్కూటర్‌ను వెనక్కి తీసుకుని మళ్లీ మెయిన్ రోడ్డుపైకి వెళ్లి వాహనాల వరుసలో నిలబడ్డాడు.
ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది. కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ కూడా ఈ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఆ బామ్మను ప్రశంసించింది. ఆమె ఎవరో గుర్తు పట్టి, ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలని వీడియో చూసిన వారు కోరుతున్నారు. ముఖ్యంగా నెటిజెన్లు "సూపర్ బామ్మ.. సమాజానికి మీ లాంటి వారు ఎంతో అవసరం" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫుట్‌పాత్‌లు నడిచే వారి కోసమే కానీ.. వాహనాలు నడపడానికి కాదనే కనీస జ్ఞానం లేని వ్యక్తికి ఈ బామ్మ ఒక గొప్ప పాఠం నేర్పారంటూ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa