పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ జీవితం జైల్లోనే ముగిసిపోయేలా ఉంది. అడియాలా జైల్లో ఉన్న ఆయన ఆరోగ్యం ఇప్పటికే క్షీణించగా.. ప్రస్తుతం కంటిచూపు కూడా మందగించినట్టు కోర్టు నియమించిన మధ్యవర్తి (అమికస్ క్యూరీ) నివేదిక పేర్కొంది. ఒంటరిగా ఓ గదిలో నిర్బంధించి, ఉద్దేశపూర్వకంగా, అమానవీయంగా, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ సల్మాన్ సఫ్దర్ రూపొందించిన పూర్తిస్థాయి నివేదికలో భయానక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నివేదిక ప్రకారం అనేక నెలలుగా ఆయన ఆరోగ్య సమస్యల గురించి జైలు అధికారులు పట్టించుకోకపోవడంతో కుడి కంటి చూపు 85 శాతం కోల్పోయారు.
మాజీ ప్రధానిని ఒంటరిగా నిర్బంధించడం, సకాలంలో వైద్య సౌకర్యం అందజేయకపోవడం, కుటుంబ సభ్యులను కలవకుండా నిరోధించడం, న్యాయ సహాయకులకు అనుమతి ఇవ్వకపోవడం వంటి దారుణమైన అంశాలను నివేదిక బయటపెట్టింది. ఈ పరిస్థితికి ప్రభుత్వం, పాకిస్థాన్ సైన్యమే కారణమే విమర్శలు వస్తున్నాయి. దాదాపు మూడు నాలుగు నెలల కిందట అంటే గతేడాది అక్టోబరులో తన కంటి చూపు సాధారణంగా ఉండేదని అమికస్ క్యూరీకి ఇమ్రాన్ ఖాన్ వివరించారు. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గిపోయిందని, ఈ విషయం గురించి జైలు సూపరింటిండెంట్కు పదే పదే చెప్పినా ఎటువంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ నిర్లక్ష్యం కారణంగా కుడి కంటి చూపు పూర్తిగా పోయిందని పేర్కొన్నారు.
జైల్లో మాజీ ప్రధాన మంత్రి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని, ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని లాయర్ సఫ్దద్ తన నివేదికలో ఆరోపించారు. 2023 అక్టోబర్లో అడియాలా జైలుకు బదిలీ అయినప్పటి నుంచి, ఇమ్రాన్ ఖాన్ దాదాపు రెండు సంవత్సరాల నాలుగు నెలలుగా ఏకాంత నిర్బంధంలో ఉన్నారని నివేదిక ధ్రువీకరిస్తుంది. పలు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని, వ్యక్తిగత వైద్యుడ్ని చికిత్సకు అనుమతించలేదని ఇమ్రాన్ చెప్పారు. తన కుటుంబసభ్యులను కలవడానికి కూడా నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త జైలు సూపరింటిండెంట్ వచ్చిన తర్వాత తన భార్యను వారానికి ఒకసారి కలవడానికి అనుమతిస్తున్నారని ఇమ్రాన్ అన్నట్టు నివేదికలో పొందుపరిచారు.
‘‘గత ఐదు నెలలుగా మాజీ ప్రధానిని తన లాయర్ లేదా న్యాయ బృందంలోని ఇతర సభ్యులను కలవడానికి అనుమతించలేదు.. ఇది రాజ్యాంగ విరుద్దం.. ఆయన వాదనలను వినిపించే, విచారణలో పాల్గొనే ఆయన సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది’’ ఆయన అని హెచ్చరించారు. ‘ఇంకా జాప్యం చేస్తే పిటిషనర్ శ్రేయస్సుకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుం.., దీనిని నివారించాలి.. నిపుణులైన కంటి వైద్య నిపుణులతో తక్షణ పరీక్ష చేయించాలి.. కుటుంబం, చట్టపరమైన ప్రాప్యతను పునరుద్ధరించాలి’’ అని సిఫార్సు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa