ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంబోడియాలో భారతీయుల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్

international |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 11:01 PM

కంబోడియా దేశంలోని కొందరు వ్యక్తులు అంతర్జాతీయ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాల ప్రజలే లక్ష్యంగా డిజిటల్ అరెస్టులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వారిని నమ్మించేందుకు వారి దేశంలోని పోలీస్ స్టేషన్లను (నకిలీ పోలీస్ స్టేషన్లను) తమ దేశంలోనే ఏర్పాటు చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి స్కామర్లపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. మొత్తంగా 190 స్కామ్ సెంటర్లను మూసివేసింది. మరెంతో మంది నిందితులను అరెస్ట్ చేసింది. ఈక్రమంలోనే భారతీయులే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఓ రహస్య స్థావరంపై పోలీసులు దాడులు చేయగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా భారతీయ బాధితులను నమ్మించేందుకు అక్కడే ఓ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం.. అందులో మహాత్మ గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోలు పెట్టడం అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.


గాంధీ, అంబేడ్కర్ ఫోటోలతో వినూత్న మోసం


కంబోడియాలోని సైబర్ నేరగాళ్లు బాధితులను నమ్మించడానికి అత్యంత అధునాతన మార్గాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా కంబోడియాలోని కాంపోట్ ప్రావిన్స్‌లో ఏకంగా భారతీయుల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్‌నే ఏర్పాటు చేసేశారు. అంతేకాకుండా వీడియో కాల్ చేసినప్పుడు బాధితులకు నిజమైన పోలీస్ స్టేషన్ అనే భ్రమ కలిగించడానికి వెనుక గోడలపై మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఫోటోలతో పాటు భారత జాతీయ పతాకాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సెటప్ ముందు పోలీసు యూనిఫాంలో కూర్చుని నేరగాళ్లు భారతీయులకు ఫోన్లు చేసి.. వారు ఏదో నేరంలో ఇరుక్కున్నారని, 'డిజిటల్ అరెస్ట్' చేస్తున్నామని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు.


190 స్కామ్ సెంటర్లు మూసివేత..!


గత కొన్ని వారాలుగా కంబోడియా అధికారులు అంతర్జాతీయ సైబర్ ముఠాలపై భారీగా దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 190కి పైగా స్కామ్ సెంటర్లను సీజ్ చేసినట్లు కంబోడియా ఆన్లైన్ క్రైమ్స్ కాంబాటింగ్ కమిషన్ చైర్మన్ ఛాయ్ సినారిత్ వెల్లడించారు. ఈ దాడుల్లో 173 మంది కీలక నేరస్థులను అరెస్ట్ చేయగా.. సుమారు 11,000 మంది కార్మికులను వారి దేశాలకు తిరిగి పంపించినట్లు చెప్పారు. చైనా సంతతికి చెందిన ఒక వ్యాపారవేత్తే ఈ స్కామ్ నెట్‌వర్క్‌కు అధినేత అని అధికారులు అనుమానిస్తున్నారు.


మరోవైపు పోలీసుల దాడుల భయంతో స్కామ్ సెంటర్లలో బానిసలుగా పని చేస్తున్న వేలాది మంది కార్మికులు అక్కడి నుంచి పారిపోతున్నారు. కేవలం కాంపోట్ ప్రావిన్స్‌లోని ఒక కాసినో కాంప్లెక్స్ నుంచే సుమారు 7,000 మంది పారిపోయినట్లు స్థానిక పోలీస్ చీఫ్ మావో చన్మోతురిత్ తెలిపారు. వీరిని అడ్డుకునేందుకు తగినంత పోలీసు బలగాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఈ సెంటర్లలో పని చేస్తున్న వారిని చిత్రహింసలకు గురిచేస్తూ.. బలవంతంగా మోసాలకు పాల్పడేలా ముఠాలు ఒత్తిడి చేస్తున్నాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. అలాగే ఈ పరిస్థితిని మానవతా సంక్షోభంగా కూడా అభివర్ణించింది.


ఈ దాడుల్లో థాయ్‌లాండ్ పోలీసులకు సంబంధించిన నకిలీ స్టేషన్లు, అనేక డాక్యుమెంట్లు కూడా లభించాయి. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా పోలీసులమని చెప్పి వీడియో కాల్స్ చేస్తే భయపడవద్దని, అసలైన పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ లేదా స్కైప్ కాల్స్ ద్వారా అరెస్టులు చేయరని అధికారులు హెచ్చరిస్తున్నారు. కంబోడియా ప్రభుత్వం చేపట్టిన ఈ తాజా చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ బాధితులకు కొంత ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa