ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.., బడ్జెట్‌లో ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 07:46 PM

రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇంధ్రధనస్సు పేరుతో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది. 2026-27 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ మేరకు వెల్లడించారు. దివ్యాంగుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఇంధ్రధనస్సు పేరుతో ప్రకటించిన ఏడు వరాలలో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపారు. అయితే ఎప్పటి నుంచి ఈ పథకం అమలు చేస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఏపీలో ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో 50 శాతం రాయితీ ఇస్తు్న్నారు. ఇంధ్రధనస్సు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో వంద శాతం రాయితీ వర్తించనుంది. మహిళల తరహాలోనే దివ్యాంగులకు కూడా పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.


ప్రస్తుతం మహిళలను పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. 2025 ఆగస్ట్ 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పేరుతో ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులలో రద్దీ పెరిగింది. అయితే ఉచిత బస్సు ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయనుంది.


  ఇంధ్రధనస్సు.. వరాలివే..


మరోవైపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు ఇంధ్ర ధనస్సు పేరుతో ఏడు వరాలు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల తరహాలోనే దివ్యాంగులకు కూడా ఆర్థిక సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లతో పాటుగా పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ ప్రైజెస్‌లలోకి దివ్యాంగ ప్రతినిధులను నామినేట్ చేస్తామని చంద్రబాబు తెలిపారు. శాప్‌ ద్వారా దివ్యాంగులకు క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్‌మెంట్‌ స్కీములు అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు.


ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగుల కోసం గ్రౌండ్ ఫ్లోర్ కేటాయించటంతో పాటుగా.. స్కూళ్లు, కాలేజీలలో చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు వారు ఉన్నచోటే పింఛన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. దివ్యాంగుల కోసం అమరావతిలో దివ్యాంగ భవన్ కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa