ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లికి ముందే శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 11:12 PM

పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. వివాహానికి ముందు లైంగిక సంబందంలోకి అడుగుపెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని, అసలు ఈ సంబంధాలు ఎలా సాధ్యమని, బహుశా తమవి పాతకాలపు ఆలోచనలేమోనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనంపై విధంగా స్పందించింది. అప్పటికే వివాహమైన అతడు.. మరో మహిళకు పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకుని, తర్వాత మరో మహిళను వివాహం చేసుకున్నాడనేది ప్రధాన ఆరోపణ..


ఆ వ్యక్తి బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న మాట్లాడుతూ... ‘పెళ్లికి ముందు శారీరక సంబంధాలు విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలి.. బహుశా మనవి పాతకాలపు ఆలోచనలే కావచ్చు.. కానీ, పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయి అపరిచితులే.. వారి సంబంధం ఎంత గాఢంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పెళ్లికి ముందు లైంగిక సంబంధంలో ఉండటం ఎలా సాధ్యమనేది మాకు ఇప్పటీకీ అర్ధం కావడం లేదు’ అని అన్నారు. ‘ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, పెళ్లికి ముందు ఎవరు ఎవర్నీ నమ్మకూడదు’ అని వ్యాఖ్యానించారు.


మ్యాటిమోనియల్ సేవలు అందించే ఓ వైబ్‌సైట్‌ ద్వారా బాధిత మహిళ, నిందితుడు మధ్య 2022లో పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తి ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి, శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడని, దుబాయ్‌లో పలుసార్లు కలుసుకున్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఇరువురూ ఏకాంతగా ఉన్నప్పుడు ఆమె అనుమతి లేకుండానే వీడియోలు తీసి, వాటిని బయటపెడతానని బెదిరించాడని ఆరోపణలు చేసింది. కొద్ది రోజుల్లో అతడి నిజస్వరూపం బయటపడిందని, అప్పటికే పెళ్లైనట్టు, 2024లో పంజాబ్‌లో మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నట్టు బాధితురాలు గుర్తించింది.


ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకుంటూ... పెళ్లికి ముందు అతడితో దుబాయ్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ప్రాసిక్యూషన్ దీనికి స్పందిస్తూ.. మ్యాట్రమోనియల్ సైట్‌ ద్వారా కలిశారాని, పెళ్లి చేసుకోవాలని భావించారని అన్నారు. ఆమె ప్రాధాన్యత వివాహమే అయితే అతడితో కలిసి దుబాయ్ వెళ్లి ఉండకూదని జస్టిస్ నాగరత్న అన్నారు. ‘‘ఆమె అంత కఠినంగా ఉంటే పెళ్లికి ముందే వెళ్లి ఉండకూడదు. మేము వారిని మధ్యవర్తిత్వానికి పంపుతాం.. పరస్పర అంగీకారంతో శారీరక సంబంధంలో ఉంటే విచారించే కేసులుగా పరిగణించలేం’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. అనంతరం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa