శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌పై కొందరు విమర్శలు గుప్పించారు. ఈ మ్యాచ్‌కు వెళ్లడానికి ప్రభుత్వ నిధులను భారీగా ఖర్చు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ ఆరోపణలను లోకేశ్ తీవ్రంగా ఖండించారు. భారత జట్టుకు మద్దతుగా టీమిండియా జెర్సీ ధరించి, త్రివర్ణ పతాకంతో స్టేడియంలో ఉత్సాహంగా కనిపించిన లోకేశ్, మ్యాచ్ అనంతరం తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ విమర్శలపై పుష్ప స్టైల్లో వ్యంగ్యంగా స్పందించిన లోకేశ్, "ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్?" అంటూ పోస్ట్ చేశారు. తన సొంత డబ్బుతోనే ఈ పర్యటన చేశానని, ప్రజాధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. ఈ సెటైర్ వైరల్ అయ్యింది.
ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా స్పష్టత ఇచ్చింది. లోకేశ్ పర్యటనకు సంబంధించి ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని ధృవీకరించింది. అన్ని ఖర్చులు మంత్రి సొంత ఖర్చులతోనే జరిగాయని తెలిపింది. దీంతో ఆరోపణలు అవాస్తవమని నిరూపితమైంది.
ఈ ఘటన రాజకీయ విమర్శలు, సోషల్ మీడియా ప్రచారాల మధ్య జరుగుతున్న వాదనలకు మరో ఉదాహరణగా నిలిచింది. లోకేశ్ స్పందన ద్వారా ప్రజాధన వినియోగంపై పారదర్శకతను నొక్కి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa