ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా ఏఐ సమ్మిట్లోకి దూసుకెళ్లిన యూత్ కాంగ్రెస్ నాయకులు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 07:19 PM

న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గందరగోళం చెలరేగింది. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మిట్‌ వద్ద యువజన కాంగ్రెస్ నాయకులు ఆందోళనలకు దిగారు. షర్టులు విప్పి ఒక్కసారిగా దూసుకొచ్చారు. వేదికలోని ఓ హాలు బయట నినాదాలు వినిపించినట్టు సమ్మిట్‌లో ఉన్నవారు తెలిపారు. ఏమి జరిగిందో చూసేందుకు వెళ్లిన సమయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అక్కడ నిరసన చేస్తున్నారని చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో షరతులకు ప్రభుత్వం తలొగ్గిందని ఆరోపించారు. వాణిజ్య ఒప్పందం వల్ల భారత్‌కు ఎటువంటి ప్రయోజనం ఒనగూరదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ముందునుంచి ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు సమ్మిట్ వద్ద నిరసనకు దిగారు.


యూత్ కాంగ్రెస్ నిరసనపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఏఐ సదస్సును అడ్డుకోవాలనే కాంగ్రెస్ ప్రయత్న. దేశ అభివృద్ధి కథనంపై ఆ పార్టీకున్న అసూయ ఫలితమని మండిపడింది. కాంగ్రెస్‌కే ఏఐ అంటే యాంటీ-ఇండియా అని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ విమర్శించారు. ‘ఐఎన్‌సీ అనేది వాస్తవానికి ఏఎన్‌సీ లేదా యాంటీ నేషనల్ కాంగ్రెస్ అని నిరూపించుకుంది.. ఆందోళన చేస్తున్నవారికి షర్టులే కాదు వ్యక్తిత్వం కూడా లేదు’ అని దుయ్యబ్టటారు.


వాణిజ్య ఒప్పందంలో భాగంగా రూపొందంచిన ఫ్రేమ్‌వర్క్‌లో డ్రైడ్ డిస్టిల్లిరీస్, గింజధాన్యాలు, పశువుల దాణా సోర్గుమ్, వాల్ నట్స్, తాజా మరియు ప్రాసెస్డ్ పండ్లు, సోయాబీన్ ఆయిల్,వైన్, స్పిరిట్స్ సహా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అనే వస్తువులపై పూర్తిగా సుంకాలు రద్దు లేదా తగ్గించనున్నారు. దీనికి బదులుగా భారత్ వస్తువులపై ప్రతీకార సుంకాలను అమెరికా 18 శాతానికి తగ్గించనుంది. అయితే, దీని వల్ల భారత్‌కు లభించే ప్రయోజనాలు కంటే అమెరికాకే ఎక్కువ లబ్ది చేకూరుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంతేకాదు, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు గేట్లు బార్లా తెరుచుకోవడంతో దేశ రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని కాంగ్రెస్ అంటోంది.


కాగా, ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026పై చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్‌ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్‌మాన్ ప్రశంనలు కురిపించారు. దాదాపు ప్రతి రంగంలోనూ ఏఐ అత్యంత వేగవంతమైన అభివృద్ధి, పరిణామంపై నియంత్రణను ఉంచే ప్రయత్నాలను సమన్వయం కోసం ప్రపంచానికి ఒక అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లాంటి సంస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐను ఒక కంపెనీ లేదా దేశంలో కేంద్రీకరణ వినాశనానికి దారితీయవచ్చని ఆల్ట్మాన్ హెచ్చరించారు. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ముందు ఐదు రోజులే నిర్వహించాలని అనుకున్నారు. తర్వాత మరో రోజు పొడిగించారు. ఈ సమ్మిట్‌లో ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీల సీఈఓలు, నాయకులు పాాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa