అధిక కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ లేదా సైలెండ్ డిసీజ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది తీవ్ర పరిస్థితికి చేరుకునే వరకు ఎటువంటి స్పష్టమైన లక్షణాల్ని చూపించదు. అంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినా లక్షణాలు స్పష్టంగా కనిపించవని డాక్టర్ బసవరాజ్ ఎస్ కుంబార్ (కన్సల్టెంట్- ఇంటర్నల్ మెడిసిన్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) చెప్పారు.
సాధారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు ఎటువంటి నొప్పి లేదా నీరసం, అలసట వంటి లక్షణాలు కనిపించవు. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. రక్తనాళాల గోడల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఈ పరిస్థితిలో మనకు ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు.
ప్రముఖ పరిశోధనలు అంటే నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో పబ్లిష్ అయిన పరిశోధన ప్రకారం చాలా మంది రోగులకు తమకు కొలెస్ట్రాల్ సమస్య ఉందని తెలియదు. చాలా మందికి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చినప్పుడే అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉందని తెలుస్తుంది. అంటే అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవచ్చు.
సాధారణంగా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. రక్తనాళాల గోడల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఈ పరిస్థితిలో మనకు ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. ప్రాణాంతక పరిస్థితులు అంటే గుండెపోటు, పక్షవాతం వంటి పరిస్థితులు తలెత్తినప్పుడే వారికి అధిక కొలెస్ట్రాల్ ఉందని తెలుస్తుంది. అందుకే లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండకండి.
డాక్టర్ బసవరాజ్ ఎస్ కుంబార్
ఎలాంటి పరిస్థితుల్లో లక్షణాలు కనిపిస్తాయి?
కొందరిలో వంశపారంపర్యంగా వచ్చే సమస్యల వల్ల అతి చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే జన్యులోపాల వల్ల పుట్టుకతోనే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండే పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే కొన్ని బాహ్య లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. కొవ్వు గడ్డలు కనిపించడం, కంటి పాప చుట్టూ తెల్లటి వలయం, కనురెప్పలపై కొవ్వు, ఛాతీ నొప్పి, చిన్న వయసులోనే గుండె నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అసలు కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది?
రక్తంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా వస్తుంది. అంతర్గతంగా అంటే కాలేయం దానిని స్వయంగా ఉత్పత్తి చేస్తుంది. బాహ్య అంటే ఆహారం నుంచి వస్తుంది. మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి జంతువుల ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుడ్డులోని తెల్లసొనలో కొలెస్ట్రాల్ ఉండదు. అయితే పాల నుంచి మీగడ తొలగించడం వల్ల దానిలోని కొవ్వు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు ఏం జరుగుతుంది?
క్లీవ్‌ల్యాండ్ క్లీనిక్ నివేదిక ప్రకారం శరీరంలో LDL కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు.. అది రక్త నాళాల గోడలకు (ధమనులు) అతుక్కోవడం ప్రారంభమవుతుంది. క్రమంగా ఇది ప్లేక్ అనే గట్టి పొరను ఏర్పరుస్తుంది. ధమనుల్ని ఇరుకుగా చేసి గట్టిపరుస్తుంది. ధమనులు ఇరుకుగా మారినప్పుడు గుండె, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలకు చేరే రక్తం పరిమాణం తగ్గుతుంది. ఇది అధిక రక్తపోటు, ఛాతీ నొప్పి, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాళ్ళ నొప్పి, మూత్రపిండాల సమస్యలు కూడా తలెత్తవచ్చు. అయితే, కొన్ని సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ సూచించారు.
ఎవరు లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి?
మధుమేహంతో బాధపడేవారు
అధిక రక్తపోటు ఉన్నవారు
ఊబకాయంతో బాధపడేవారు
స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నవారు
కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే గుండె జబ్బుల చరిత్ర ఉంటే.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సమతుల్య ఆహారం: ఆహారంలో మాంసాహారం, అధిక కొవ్వు పాల ఉత్పత్తుల్ని తీసుకోవడం తగ్గించండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఆహారంలో ఓట్స్, పప్పుధాన్యాలు, యాపిల్స్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల్ని చేర్చండి.
బ్రిస్క్ వాకింగ్: నడక ఆరోగ్యానికి మంచిది. రోజుకు కనీసం ముప్పై నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయండి. దీని వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
వ్యాయామం: వారానికి కనీసం 150 నిమిషాల మితమైన వ్యాయామం చేస్తే కొలెస్ట్రాల్ స్థాయిల్ని అదుపులో ఉంచుకోవచ్చు.
లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు: మీ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల్ని కాలానుగుణంగా చెక్ చేయండి.
గుర్తించుకోండి: అధిక కొలెస్ట్రాల్ ఎటువంటి హెచ్చరికలు ఇవ్వదు. కాబట్టి ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకోవడమే ఏకైక మార్గమని డాక్టర్ సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa