ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాత్రి భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతారా

Life style |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 11:33 PM

మధ్యాహ్న భోజనం లేదా డిన్నర్ మానేయడం వల్ల బరువు తగ్గరని డాక్టర్ బసవరాజ్ ఎస్ కుంబార్ (కన్సల్టెంట్- ఇంటర్నల్ మెడిసిన్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) చెప్పారు. ఇలా భోజనం స్కిప్ చేయడం వల్ల బరువు తగ్గకపోగా ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనం మానేయడం వల్ల అధిక బరువు లేదా ఊబకాయం వచ్చే అవకాశం పెరుగుతుందని డాక్టర్ తెలిపారు.


మీరు ఎక్కువసేపు ఆకలితో ఉన్నప్పుడు శరీరం ఆకలి మోడ్‌లోకి వెళుతుంది. ఇది మీ జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. శరీరం కొవ్వును బర్న్ చేయడానికి బదులుగా నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. ఇది కండరాల నష్టం కారణంగా తాత్కాలిక బరువు తగ్గడానికి దారితీస్తుంది. అయితే, బరువు తగ్గిన తర్వాత మళ్లీ వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల మీ బరువు తగ్గే ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుందని డాక్టర్ చెబుతున్నారు.


భోజనం స్కిప్ చేయడం వల్ల ఆరోగ్యంపై ఎఫెక్ట్


భోజనం లేదా డిన్నర్ మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది అకస్మాత్తుగా తలతిరగడం, బలహీనత, తలనొప్పి, అలసటకు దారితీయొచ్చు. శరీరానికి శక్తి లేనప్పుడు.. అది కండరాలతో పనిచేయించి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీర బలాన్ని తగ్గిస్తుంది.


మీరు భోజనం మానేసినప్పుడు కొన్ని కేలరీల్ని తగ్గించుకోగలరు. అయితే, ఇది బరువు తగ్గడానికి సాయపడదు. ఇది ఆహారం యొక్క మొత్తం నాణ్యతను దెబ్బతీస్తుంది. భోజనం మానేసిప్పుడు మీరు ఎక్కువగా తినే అవకాశం ఉంది. ఆకలి పెరిగినప్పుడు ఎక్కువ తినాలనే కోరికను మెదడు సంకేతాల రూపంలో పంపుతుంది. దీంతో మీరు అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ అలవాటు మీ బరువును తగ్గించడానికి బదులుగా పెంచే అవకాశం ఉంది


డాక్టర్ బసవరాజ్ ఎస్ కుంబార్


భోజనం ఎందుకు ముఖ్యమైంది?


రోజువారీ అనేక పనుల కోసం మన శరీరం ఎంతో శక్తిని ఉపయోగిస్తుంది. ఈ శక్తి బ్రేక్‌ఫాస్ట్, భోజనం, డిన్నర్‌ ద్వారా మన శరీరానికి లభిస్తుంది. మధ్యాహ్న భోజనం ద్వారా శరీరానికి అవసరమైన శక్తి, పోషకాలు, మైక్రోన్యూట్రియెంట్స్ లభిస్తుంది. భోజనం మనల్ని శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉంచుతుంది. అయితే, మనం భోజనం స్కిప్ చేయడం వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర, శక్తి స్థాయిలు, హార్మోన్ల సమతుల్యత వంటివి ప్రభావితమవుతాయి.


సరళంగా చెప్పాలంటే మనం భోజనం మానేసినప్పుడు శరీరం తర్వాత భోజనం చేయడానికి శక్తిని ఆదా చేయాల్సి వస్తుంది. ఇది జీవక్రియ రేటును నెమ్మదించేలా చేస్తుంది. ఆ తర్వాత శరీరానికి ఆకలిగా అనిపించేలా చేస్తుంది. దీంతో అతిగా తినే అలవాటును పెంచుతుంది. బరువు తగ్గడం కోసం భోజనం లేదా డిన్నర్ స్కిప్ చేయడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.


రాత్రి భోజనం మానేసినా ఇబ్బందే


ఇంకొందరు రాత్రి పూట ఆహారం తీసుకోకపోతే కేలరీలు ఖర్చు అవ్వవు అనుకుంటారు. దీంతో రాత్రిపూట తినడమే మానేస్తారు. అయితే డాక్టర్ బసవరాజ్ ప్రకారం రాత్రి భోజనం మానేసే వారిలో బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు మొదట బరువు తగ్గింది అనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. భవిష్యత్తులో అధిక బరువు లేదా ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని డాక్టర్ హెచ్చరిస్తున్నారు. అంటే మీరు బరువు తగ్గడానికి చేసే ఈ ప్రయత్నం చివరికి బరువు పెరగడానికి కారణమవుతుంది.


బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?


బరువు తగ్గడానికి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అవేంటో చుద్దాం.


ప్రోటీన్ ఫుడ్స్: బాయిల్డ్ ఎగ్స్, చికెన్ బ్రెస్ట్, చేపలు


తృణధాన్యాలు: ఓట్స్, చిరుధాన్యాలతో ఉప్మా, మిల్లెట్స్


కూరగాయలు: దోసకాయ, సొరకాయ, బీరకాయ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, పాలకూర వంటి ఫైబర్ అధికంగా కూరగాయల్ని తినండి.


పండ్లు: యాపిల్స్, జామపండు, నారింజ వంటి పోషకాలు ఉన్న పండ్లు తినాలి.


ముగింపు


భోజనం మానేయడం అనే మీ ప్రయత్నం బరువు తగ్గడానికి సరైన పద్ధతి కాదని డాక్టర్ బసవరాజ్ అంటున్నారు. ఇది ఆహార నియమాలకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ప్రయత్నం వల్ల అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మాత్రమే కాకుండా ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు భోజనాన్ని మానేయడం కంటే.. సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. అంటే పోషకాలతో నిండి ఉన్న ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోవడం ముఖ్యం. బరువు తగ్గాలనే మీ లక్ష్యం సమతుల్య ఆహారంతో సాధ్యమవుతుంది తప్ప కడుపు మాడ్చుకోవడం వల్ల కాదని డాక్టర్ తేల్చి చెబుతున్నారు. అంతేకాకుండా వాకింగ్, తగినంత నిద్ర, ఒత్తిడి నిర్వహణ వంటి చిట్కాలు ఫాలో అయితే బరువు తగ్గొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa