ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్మూజ్ మూసివేత.. రిస్క్‌లో భారత్‌కు చెందిన రూ.10 వేల కోట్ల విలువైన నౌకాశ్రయ ఆస్తులు

international |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 07:49 PM

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధిని మూసివేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించాయి. అంతేకాదు, ఏ నౌక అయినా వెళ్లేందుకు ప్రయత్నిస్తే పేల్చేస్తామని హెచ్చరించింది. దీంతో వందలాది నౌకలు ఆ మార్గంలో నిలిచిపోగా.. భారత్‌కు చెందిన నౌక యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నౌకలు సురక్షితంగా అక్కడ నుంచి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ మేరకు కేంద్ర పోర్టులు, నౌకాయాన మంత్రిత్వ శాఖకు మంగళవారం లేఖ రాశారు.


ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం, గ్యాస్‌లో 40 శాతం ఒమన్, ఇరాన్ మధ్య ఉండే హర్మూజ్ జల సంధి ద్వారా జరుగుతుంది. ఇక, భారత్‌కు వచ్చే 40 శాతం ఆయిల్, 50 శాతం సహజవాయువు ఇదే మార్గంలో చేరుతుంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక నేతలు హతమవ్వడంతో ఈ జల సంధిని ఇరాన్ మూసివేసింది.


కేంద్ర పోర్టులు, నౌకాయాన శాఖ మంత్రిత్వ శాఖకు ఇండియన్ నేషనల్ షిప్ ఓనర్స్ అసోసియేషన్ ( INSA ) రాసిన లేఖలో.. 27 భారత జెండాలున్న నౌకలు ఆ ప్రాంతంలో చిక్కుకున్నాయని, రూ.10 వేల కోట్లకుపైగా విలువైన షిప్పింగ్ ఆస్తులు ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, హర్మూజ్‌లో ఆరో నౌకపై దాడిచేసినట్టు సోమవారం ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. వీటిలో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్న నౌక కూడా ఉంది. ఐఎన్‌ఎస్ఏ అనుబంధ సంస్థకు చెందిన నౌక క్షిపణి దాడి నుంచి త్రుటిలో తప్పించుకుందని కేంద్రానికి రాసిన లేఖలో తెలిపారు.


జల సంధి దక్షిణ భాగంలో కొన్ని భారతీయ నౌకలు చమురు లోడింగ్ కోసం వేచి చూస్తున్నాయని చెప్పారు. రవాణా, బీమా ఖర్చులు పెరిగే ఆస్కారం ఉందని, ఇరాన్, ఇజ్రాయెల్‌తో చర్చించి భారతీయ నౌకలు సురక్షితంగా వెళ్లేందుకు మార్గం కల్పించాలని కోరారు.


అంతర్జాతీయ షిప్-ట్రాకింగ్ ఇంటెలిజెన్స్ కంపెనీ మెరైన్‌ట్రాఫిక్ లైవ్‌ షిప్స్ మ్యాప్ ప్రకారం.. పశ్చిమాసియాలో కీలక పోర్టుల్లోని సురక్షిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నౌకలను లంగరు వేశారు. హర్మూజ్‌లో దాదాపు నౌకల ప్రయాణం నిలిచిపోయింది. మెరైన్ ట్రాఫిక్ లైవ్ షిప్స్ మ్యాప్‌లోని రెడ్ డాట్స్ ఎగుమతి, దిగుమతి సరుకులను పోర్టుల్లో డెలివరీ చేసిన తర్వాత తిరిగి వచ్చే నౌకలను సూచిస్తాయి. గ్రీన్ డాట్స్ యుద్ధం ప్రారంభమైన తర్వాత వివిధ ఓడరేవులకు వెళ్లే సరుకులను మోసుకెళ్లే ఓడలను సూచిస్తాయి.


అలాగే, భారత్ నుంచి మధ్య ఆసియాలోని పలు దేశాలకు వెళ్లాల్సిన బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు పోర్టులు, కార్గో నౌకల్లో నిలిచిపోయాయి. ప్రస్తుతం హర్మూజ్ జల సంధి గుండా ఒకటి రెండు నౌకలు మాత్రమే వెళ్తున్నాయి. యుద్ధ భయాలతో పెద్ద సంఖ్యలో కార్గో నౌకలు మధ్య ఆసియా దేశాల్లోని పెద్ద పోర్టుల్లోని సురక్షిత జోన్‌లో ఉన్నాయని ఫర్చ్యూన్ రైస్ లిమిటెడ్ ఎక్స్‌పోర్టర్ అండ్ డైరెక్టర్ దీపక్ కుమార్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa