పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. ఇరాన్ దాడులతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌కు భారత్ అందిస్తున్న తిరుగులేని మద్దతుపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సోమవారం రోజు ప్రధాని మోదీ.. నెతన్యాహుకు ఫోన్ చేసి మరీ చాలా సేపు మాట్లాడారు. దీన్ని ఉద్దేశించే నెతన్యాహు.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నిజం వైపు నిలబడ్డారు..
ఇరాన్ క్షిపణి దాడిలో ధ్వంసమైన బీట్ షెమేష్‌లోని ఒక ప్రార్థనా మందిరం శిథిలాలను పరిశీలిస్తున్న సమయంలో నెతన్యాహు మీడియాతో మాట్లాడారు. ఈక్రమంలోనే "నిన్న నేను నా ఆప్తమిత్రుడు నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా మాట్లాడాను. ఇజ్రాయెల్ వైపు, నిజం వైపు నిలబడినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను. భారత ప్రజలు ఇజ్రాయెల్‌పై చూపిస్తున్న అపారమైన ప్రేమ, స్నేహం వెలకట్టలేనిది. వారిని ఇజ్రాయెల్ ప్రజలు ఎంతగానో ప్రేమిస్తారు" అని నెతన్యాహు పేర్కొన్నారు. అలాగే ప్రధాని మోదీతో తాను సోమవారం రోజు ఫోన్లో చాలా సేపు మాట్లాడానని చెప్పిన నెతన్యాహు.. కానీ ఏం మాట్లాడో వివరంచలేనని అన్నారు. మోదీ ఒక్కరే కాకుండా ఇతర దేశాల నేతలతో కూడా తాను మాట్లాడనని చెప్పారు.
ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా నెతన్యాహు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడుల ప్రధాన ఉద్దేశం ఇరాన్ ప్రజలు తమ నియంతృత్వ పాలకులను గద్దె దించేలా ప్రోత్సహించడమేనని ఆయన స్పష్టం చేశారు. "ఆ విముక్తి రోజు దగ్గరలోనే ఉంది. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఆ సమయంలో ఇజ్రాయెల్, అమెరికా వారికి అండగా ఉంటాయి" అని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పటికే ఇరాన్ ప్రజలను ఉద్దేశించి "మీ దేశాన్ని మీరు దక్కించుకోండి" అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఇరాన్ సోమవారం రోజు సాయంత్రం కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు తెగబడింది. ఐడీఎఫ్ సమాచారం ప్రకారం.. ఇరాన్ ప్రయోగించిన మూడు క్షిపణులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు గాలిలోనే ధ్వంసం చేశాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లకు హెచ్చరికలు అందిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య ఉన్న రక్షణ, వాణిజ్య వ్యూహాత్మక సంబంధాలు ఈ సంక్షోభ సమయంలో మరింత బలపడుతున్నట్లు నెతన్యాహు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa