ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ ఇజ్రాయెల్ విడిచిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌పై యుద్ధం

international |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 07:40 PM

ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. అయితే ఆ సమయంలో ఇరాన్‌పై దాడులు జరగబోతున్నాయన్న విషయం తమకు కూడా తెలియదని రూవెన్ అజార్.. ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "మోదీ పర్యటనలో ప్రాంతీయ పరిణామాలపై చర్చించాం. కానీ మాకే తెలియని విషయాన్ని ఆయనతో పంచుకోలేం కదా" అని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ పర్యటన ముగిసిన రెండు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 28వ తేదీ శనివారం ఉదయం ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఈ దాడులకు తుది అనుమతిని ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.


ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ .. 700 మంది మృతి


ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇరాన్‌ను అతలాకుతలం చేసింది. నిలిచిపోయిన అణు చర్చలు, ఇరాన్ మళ్లీ అణు కార్యకలాపాలు ప్రారంభించిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీ సహా ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మరణించారు. వీరు మాత్రమే కాకుండా 30 మంది అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఈ మారణకాండలో 700 మందికి పైగా హతమయ్యారు.


ఈ దాడుల కోసం ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించిందని రూవెన్ అజార్ తెలిపారు. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను ఛేదించే సాంకేతికతను అభివృద్ధి చేయడంతో పాటు ఆ దేశ నేతలు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే నిఘా సామర్థ్యాన్ని ఇజ్రాయెల్ సాధించిందని చెప్పారు. అమెరికా సెంట్రల్ కమాండ్, అబ్రహం ఒప్పందాల ద్వారా అరబ్ దేశాల సహకారంతో ఈ భారీ ఆపరేషన్‌ను సమన్వయం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఖమేనీ మరణంతో ప్రస్తుతం ఇరాన్ అట్టుడుకుతోంది. ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాలుగైదు వారాల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకటించారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa