ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులు, హర్మూజ్ జల సంధి మూసివేతతో ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో భారత్‌కు తాత్కాలికంగా ఊరటనిచ్చేలా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా చమురు దిగుమతి చేసుకోడానికి 30 రోజుల పాటు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ ఎక్స్ (ట్విట్టర్) లో వెల్లడించారు. రష్యా నుంచి ఇండియన్ రిఫైనరీలు ఆయిల్ కొనుగోలు చేయడానికి తాత్కాలికంగా నెల రోజులు మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లోకి ఆయిల్ సరఫరా అవుతుందని వివరించారు.
‘‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంధన ఎజెండా ఫలితంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి ఇప్పటివరకు అత్యధిక స్థాయికి చేరుకుంది. ప్రపంచ మార్కెట్లోకి చమురు సరఫరా జరిగేలా భారతీయ రిఫైనరీలు రష్యా చమురు కొనుగోలుకు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తాత్కాలికంగా 30 రోజుల మినహాయింపును జారీ చేసింది’’ అని తెలిపారు. అయితే, ఇప్పటికే సముద్రంలో చిక్కుకుపోయిన రష్యా ఆయిల్ ట్యాంకర్ నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు జరగాలని ఆయన స్పష్టంచేశారు. దీని వల్ల రష్యానకు ఆర్థికంగా ఎటువంటి ప్రయోజనం చేకూరదని అన్నారు. వివిధ ఆంక్షల ద్వారా నిరోధించిన నౌకల నుంచి జరిగే లావాదేవీలు సహా చమురు కొనుగోళ్లకు ఏప్రిల్ 3 వరకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అమెరికాకు భారత్ అతి ముఖ్యమైన భాగస్వామి అని బెసెంట్ చెప్పారు. భవిష్యత్తులో తమ క్రూడాయిల్ కొనుగోళ్లను భారత్ పెంచుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ప్రపంచ ఇంధన మార్కెట్ల స్థిరీకరణ ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్య తీసుకుంది. ఉక్రెయిన్‌తో ఫిబ్రవరి 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి భారీగా ఆయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంటోంది. కానీ, ట్రంప్ అదనపు సుంకాలు, అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఇటీవల రష్యా క్రూడాయిల్ దిగుమతులు తగ్గాయి. ఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌తో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నౌకల రవాణా నిలిచిపోయి ఆయిల్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లో 15 శాతం మేర పెరిగి బ్రెంట్ క్రూడ్ ధర 85 డాలర్లకు చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa