ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టార్పెడోతో భారత యుద్ధనౌకను కూల్చిన పాక్.. ఇండియా ప్రతీకారానికి కరాచీ కకావికలం

national |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 07:23 PM

ఇరాన్‌కు చెందిన ఐఆర్ఐఎస్ దేనా అనే యుద్ధ నౌకను శ్రీలంక తీరానికి సమీపంలో యూఎస్ జలాంతర్గామి టార్పెడోతో దాడి చేసి, ముంచేసిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో జరిగిన సైనిక విన్యాసాల్లో పాల్గొన్న అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో.. అమెరికా ఈ దాడి చేసింది. దీంతో శ్రీలంక నౌకాదళం రంగంలోకి దిగి ఇరాన్ నేవీ సిబ్బందిని రక్షించే ప్రయత్నం చేసింది. ఇరాన్ నావికులను కాపాడేందుకు తాము కూడా రంగంలోకి దిగామని భారత నౌకాదళం సైతం ప్రకటించింది.


టార్పెడోలను జలాంతర్గామి నుంచి లేదా యుద్ధ నౌక నుంచి ప్రయోగించొచ్చు. కొన్ని సందర్భాల్లో రాకెట్ల నుంచి కూడా టార్పెడోలను ప్రయోగించొచ్చు. అయితే ప్రస్తుతం టార్పెడోలను మించి ఆధునిక ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వీటి ప్రయోగం తగ్గింది. ప్రస్తుతం భారత్ వద్ద కూడా వరుణాస్త్ర లాంటి టార్పెడోలు ఉన్నాయి. వీటిని స్వదేశీయంగా తయారు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత టార్పెడోలను ఇప్పటి దాకా నాలుగుసార్లే ప్రయోగించారు.


అందులో ఒకటి పాకిస్థాన్ సబ్‌మెరైన్ భారత యుద్ధనౌకపై చేసిన దాడి కాగా.. రెండోది ఫాక్స్‌లాండ్ యుద్ధంలో భాగంగా జరిగింది. 1982 మే 2న అర్జెంటీనా నేవీకి చెందిన క్రూయిజర్ ఏఆర్ఏ బెల్‌గ్రానో‌పై బ్రిటన్ జలాంతర్గామి మార్క్ 8 టార్పెడోలతో దాడి చేసి ముంచేసింది. 2010లో తమ నౌకను ఉత్తరకొరియా టార్పెడోలతో దాడి చేసి ముంచేసినట్లు సౌత్ కొరియా ఖండించింది.


పాకిస్థాన్ టార్పెడో దాడి ..


1971 యుద్ధంలోనూ పాకిస్థాన్ టార్పెడో‌తో భారత యుద్ధనౌకపై దాడి చేసింది. భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి కోసం పాకిస్థాన్ నేవీ తన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన సబ్‌మెరైన్ పీఎన్ఎస్ ఘాజీని విశాఖ తీరానికి పంపింది. అయితే డిసెంబర్ 4న ఘాజీ సబ్‌మెరైన్ బంగాళాఖాతంలో పేలిపోయి మునిగిపోయింది. కరాచీ రేవుపైనా భారత నౌకాదాళం దాడి చేసి బీభత్సం సృష్టించింది.


దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్థాన్ దొంగ దెబ్బతీసింది. 1971 డిసెంబర్ 9న గుజరాత్ తీరంలోని డయ్యూకు సమీపంలో ఐఎన్ఎస్ ఖుక్రీ గస్తీలో ఉండగా.. పాక్ జలాంతర్గామి పీఎన్ఎస్ హ్యాంగర్ టార్పెడోలతో దాడి చేసింది. దీంతో కాసేపట్లోనే ఖుక్రీ నౌక నీట మునిగింది. ఈ ఘటనలో కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్లాతోపాటు భారత నౌకాదళానికి చెందిన 194 మంది సిబ్బంది వీరమరణం పొందారు. కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లాకు బయటపడే అవకాశం ఉన్నప్పటికీ.. వీలైనంత మందిని కాపాడే ప్రయత్నం చేశారు. అంతేకాదు తన లైఫ్ జాకెట్‌ను యువ అధికారికి ఇచ్చి అతణ్ని కాపాడి తను వీరమరణం పొందారు. ఈ సాహసానికి గుర్తుగా భారత ప్రభుత్వం ముల్లాకు మరణానంతరం మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. దీంతో భారత ప్రభుత్వం డయ్యూ తీరంలో ఖుక్రీ మెమోరియల్ నిర్మించింది. అక్కడ ఖుక్రీ నౌక నమునాతోపాటు కెప్టెన్ ముల్లా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.


కరాచీ పోర్టుపై భారత నేవీ దాడి..


ఈ యుద్ధంలో పాకిస్థాన్‌ నేవీకి భారత నౌకాదళం చుక్కలు చూపించింది. ఆపరేషన్ ట్రైడెంట్, ఆపరేషన్ పైథాన్ ద్వారా పాకిస్థాన్ నేవీని ఉక్కిరిబిక్కిరి చేసింది. డిసెంబర్ 4న భారత యుద్ధ నౌకలు పాకిస్థాన్‌కు చేరువగా వెళ్లి కరాచీ పోర్టుపై క్షిపణులను ప్రయోగించాయి. దీంతో పీఎన్ఎస్ ఖైబర్, పీఎన్ఎస్ షాజహాన్ నౌకలు అరేబియ సముద్రంలో మునిగిపోయాయి. కరాచీ పోర్టులోని చమురు నిల్వలకు మంటలు అంటుకొని.. రోజుల తరబడి మంటలు చెలరేగాయి.


అంతే కాదు ఖుక్రీ ఘటన జరిగిన వెంటనే.. ఆపరేషన్ పైథాన్ పేరిట భారత్ రెండోసారి కరాచీ పోర్టుపై దాడి చేసింది. ఈ దాడి తీవ్రతకు పాకిస్థాన్ నేవీ యుద్ధం ముగిసే వరకు సాగర జలాల్లోకి అడుగుపెట్టడానికే భయపడింది. కొద్ది రోజులకే 93 వేల మంది పాకిస్థాన్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa