ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐరెస్ డెనా రెస్క్యూ ఆపరేషన్‌ కోసం నౌకను పంపిన నేవీ,,,ఇరాన్‌‌కు భారత్ సాయం

national |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 07:34 PM

హిందూ మహా సముద్రంలోని శ్రీలంక తీరంలో అమెరికా పేల్చేసిన ఇరాన్ యుద్ధ నౌక ఐరెస్ డెనా రెస్యూ ఆపరేషన్‌‌కు భారత్ సహకారం అందిస్తుంది. మార్చి 4 వ తేదీ తెల్లవారుజామున కొలంబోలోని మారిటైమ్ రెస్క్యూ కో-ఆర్డినేషన్ సెంటర్ నుంచి ప్రమాద హెచ్చరిక రావడంతో తాము స్పందించినట్టు భారత నౌకాదళం ఓ ప్రకటనలో తెలిపింది. ఇరాన్ యుద్ధనౌక IRIS డెనా నుంచి వచ్చిన ప్రమాద సంకేతాన్ని అనుసరించి సెర్చింగ్, రెస్క్యూ కార్యకలాపాలను తాము ప్రారంభినట్టు పేర్కొంది. శ్రీలంక తీరం గాలే సమీపంలోని అమెరికా జలాంతర్గామి టార్పెడోతో దాడిచేయడంతో ఇరాన్ యుద్ధ నౌక మనిగిపోయిన విషయం తెలిసిందే.


గాలేకు పశ్చిమాన 40 నాటికల్ మైళ్ల దూరంలో శ్రీలంక జలాల్లో నౌక ఉండగా ప్రమాదం జరగడంతో సమాచారం అందిన వెంటనే, ఇండియన్ నేవీ ఆలస్యం చేయకుండా తన ప్రయత్నాలను ప్రారంభించింది.


‘‘శ్రీలంక ఆధ్వర్యంలో జరుగుతున్న రెస్క్యూ కార్యకలాపాలకు మద్దతుగా మార్చి 4న ఉదయం 10 గంటలకు లాంగ్-రేంజ్ మెరైన్ పెట్రోలింగ్ విమానం మోహరించాం... అవసరమైతే ఎయిర్-డ్రాపబుల్ లైఫ్ రాఫ్ట్‌లతో కూడిన రెండో విమానం కూడా సిద్ధం చేశాం... సహాయం కోసం సమీపంలో ఉన్న సెయిలింగ్ శిక్షణ నౌక INS తరంగిణికి ఆదేశాలు అందడంతో ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అది ఆ ప్రాంతానికి చేరుకుంది. అప్పటికే శ్రీలంక నేవీ, ఇతర సంస్థలు రెస్క్యూ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌కు మద్దతుగా INS ఇక్షాక్ అనే సర్వే నౌక కొచ్చి నుంచి వెళ్లింది... ధ్వంసమైన నౌకలోని గల్లంతైన సిబ్బంది కోసం రెస్క్యూ నిర్వహిస్తున్న ప్రాంతంలో ఇది ఉంది’’ అని నేవీ తన ప్రకటనలో పేర్కొంది. శ్రీలంక అధికారులు, ఇండియన్ నేవీ మధ్య సమన్వయంతో ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపింది.


విశాఖపట్నంలో గత నెల జరిగిన మిలాన్, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనడానికి వచ్చిన ఇరాన్ యుద్ధ నౌక ఐరెస్ డెనా తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ఈ సంఘటనను ‘సముద్రంలో జరిగిన దారుణం’గా అభివర్ణించారు. భారత్‌కు అతిథిగా వెళ్లిన దాదాపు 130 మంది నావికులతో ప్రయాణిస్తున్న ఓడను ఇరాన్ తీరానికి 2,000 మైళ్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో హెచ్చరిక లేకుండా ఢీకొట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడిన అమెరికాకు ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా, మరో ఇరాన్ యుద్ధ నౌక గురువారం శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి వచ్చింది. దాదాపు 300 సిబ్బంది, క్యాడెట్లతో ఉన్న ఈ నౌకను ఐరెస్ బుషహర్‌‌గా గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa