పశ్చిమాసియా రణక్షేత్రం ఇప్పుడు ఒక వ్యక్తిగత ప్రతీకార పోరాటంగా మారుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యతో మొదలైన ఈ చిచ్చు.. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను టార్గెట్ చేసే స్థాయికి చేరింది. "మా నాయకుడిని చంపినందుకు ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు" అంటూ ఇరాన్ భద్రతా విభాగం చీఫ్ అలీ లారిజానీ చేసిన హెచ్చరికలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.
"మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు"
ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీ మరణించాక.. ఇరాన్ తన పంథాను మార్చుకుంది. "మా నాయకుడి రక్తం చిందించినందుకు, వెయ్యి మందికి పైగా మా పౌరులను బలితీసుకున్నందుకు ప్రతీకారం తీర్చుకుంటాం. ట్రంప్‌ను మేము వదిలిపెట్టం.. ఆయన మూల్యం చెల్లించాల్సిందే" అని లారిజానీ ఎక్స్ వేదికగా గర్జించారు. ఇరాన్ పొరుగు దేశాలకు కూడా ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. అమెరికా తన స్థావరాలను ఇరాన్‌కు వ్యతిరేకంగా వాడుకోకుండా అడ్డుకోవాలని, లేదంటే తామే నేరుగా రంగంలోకి దిగుతామని స్పష్టం చేశారు.
"లారిజానీ ఎవరో కూడా నాకు తెలియదు": ట్రంప్
ఇరాన్ హెచ్చరికలను డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో కొట్టిపారేశారు. "అసలు ఆ లారిజానీ ఎవరు? ఆయన ఏం మాట్లాడుతున్నాడో నాకు అనవసరం. ఇరాన్ ఇప్పటికే ఓడిపోయింది" అంటూ సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇరాన్ వెంటనే షరతులు లేని లొంగుబాటు ప్రకటించాలని, లేదంటే అమెరికా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే లోపే తాము ముందుగా స్పందించామని ఆయన సమర్థించుకున్నారు.
వెనిజులా తరహా కుట్ర జరుగుతోందా?
అమెరికా తీరుపై లారిజానీ విమర్శలు చేస్తూ.. ఇరాన్‌ను ముక్కలు చేసేందుకు అమెరికా కుట్ర చేస్తోందని ఆరోపించారు. వెనిజులాలో మదురోను బంధించి, వారికి అనుకూలమైన వ్యక్తిని అధికారంలోకి తెచ్చినట్లుగా, ఇరాన్‌లో కూడా అదే సీన్ రిపీట్ చేయాలని అమెరికా చూస్తోందని ఆయన విశ్లేషించారు. అయితే పశ్చిమాసియా పరిస్థితులను అమెరికా తప్పుగా అంచనా వేస్తోందని, ఇప్పటికే వారు మా ఉచ్చులో చిక్కుకున్నారని ఎద్దేవా చేశారు. తమ వద్ద కొందరు అమెరికా సైనికులు బందీలుగా ఉన్నట్లు కూడా ఆయన సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్‌లో 1000 మందికి పైగా, ఇజ్రాయెల్‌లో డజను మందికి పైగా మరణించారు. ఆరుగురు అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ రక్తపాతం ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa