ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ వద్ద 74 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి సురేష్ గోపి

national |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 07:39 PM

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు చమురు సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా భారత్ ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దేశంలో 74 రోజులకు సరిపడా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉన్నట్లు పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి సోమవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు.అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల  సామర్థ్యంతో వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవి 9.5 రోజుల ముడి చమురు అవసరాలను తీర్చగలవు. దీనికి తోడు దేశంలోని చమురు మార్కెటింగ్ సంస్థల వద్ద 64.5 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని, మొత్తంగా దేశంలో 74 రోజుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు.చమురు నిల్వల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్  విధానంలో ఒడిశాలోని చండీఖోల్, కర్ణాటకలోని పాడూర్  వద్ద 6.5 ఎంఎంటీ సామర్థ్యంతో రెండు కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు 2021 జూలైలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. ఇవి అందుబాటులోకి వస్తే అదనంగా మరో 12 రోజులకు సరిపడా చమురు నిల్వలు పెరుగుతాయి. మరోవైపు దిగుమతులపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఇంధన సరఫరా మార్గాలను విస్తరించడం, ఘర్షణలు జరిగే ప్రాంతాలను మినహాయించి ఇతర మార్గాల ద్వారా రవాణా చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. అలాగే చమురు ఉత్పత్తి దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో దౌత్యపరమైన సంబంధాలను పటిష్ఠం చేసుకుంటోంది.దేశంలో చమురు, సహజ వాయువుల అన్వేషణ కూడా నిరంతరం కొనసాగుతోందని మంత్రి వివరించారు. 2025 ఏప్రిల్ 1 నాటికి దేశంలో 423.1 ఎంఎంటీ ముడి చమురు, 595.4 బిలియన్ క్యూబిక్ మీటర్ల  సహజ వాయువుల నిల్వలు వెలికితీసేందుకు వీలుగా ఉన్నాయని అంచనా వేశారు. గత ఐదేళ్లలో మన దేశం ముడి చమురు కోసం 85 నుంచి 88 శాతం, ఎల్‌ఎన్‌జీ కోసం 48 నుంచి 50 శాతం దిగుమతులపై ఆధారపడినట్లు మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa