ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖమేనీకి ఇష్టం లేకపోయినా.. మోజ్తబానే వారసుడిగా అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఎందుకు ఎంచుకుంది

international |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 07:42 PM

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం వేళ ఇరాన్ అత్యున్నత పీఠంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన వారసుడిగా, ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ (56) బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ చరిత్రలో ఈ అత్యున్నత పదవి మారడం ఇది మూడవసారి మాత్రమే కాగా.. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా మొజ్తబానే ఎందుకు ఎన్నుకున్నారనే ప్రశ్నలు అందరిలోనూ మొదలయ్యాయి.


కుటుంబం మొత్తాన్ని కోల్పోయి.. అధికారం చేపట్టి!


మోజ్తబా ఈ పదవిని అత్యంత విషాదకర పరిస్థితుల్లో స్వీకరించారు. గత వారంలో జరిగిన అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో కేవలం తన తండ్రిని మాత్రమే కాకుండా.. తన భార్య జహ్రా అడెల్, తల్లి మన్సౌరే ఖోజస్తే, ఒక కుమారుడిని కూడా ఆయన కోల్పోయారు. తన కుటుంబం మొత్తాన్ని యుద్ధం బలితీసుకున్న తరుణంలో.. అదే యుద్ధాన్ని నడిపించే బాధ్యతను ఆయన భుజానికెత్తుకున్నారు.


తండ్రికి ఇష్టం లేకపోయినా ఎందుకు ఎంచుకున్నారు?


ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. తన కుమారుడు మోజ్తబా తన తర్వాత సుప్రీం లీడర్ కావడం అలీ ఖమేనీకి ఏమాత్రం ఇష్టం లేదని ఆయన సన్నిహితులు తెలిపారు. 1979 విప్లవం పుట్టిందే రాచరికాన్ని, వారసత్వ పాలనను వ్యతిరేకించడానికి. ఇప్పుడు మళ్లీ తండ్రి తర్వాత కొడుకే పగ్గాలు చేపడితే అది వారసత్వ బదిలీలా కనిపిస్తుందని, విప్లవ ఆశయాలకు విఘాతం కలుగుతుందని ఆయన భావించినట్లు వివరించారు. అయినప్పటికీ.. దేశం యుద్ధంలో ఉన్నప్పుడు స్థిరత్వం కావాలని 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' భావించింది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు దీటైన సమాధానం చెప్పాలంటే ఖమేనీ వారసుడే సరైన వ్యక్తి అని 88 మంది మతగురువుల మండలి మెజారిటీతో నిర్ణయించింది.


నీడలా ఉంటూనే పట్టు సాధించి..!


ఇరాన్ రాజకీయాల్లో మోజ్తబా ఖమేనీ ఒక రహస్య శక్తిగా ఎదిగారు. దశాబ్దాలుగా ఆయన తన తండ్రి కార్యాలయంలో ఉంటూనే సైనిక, నిఘా విభాగాలను సమన్వయం చేశారు. ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడటం కానీ, ప్రజల ముందుకు రావడం కానీ చేయని ఆయన.. తన తండ్రికి లేని ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆయనకు 'అయతొల్లా'కు ఉండాల్సిన పూర్తి మతపరమైన అర్హతలు ఉన్నాయి. షియా సెమినరీ క్లాసులలో ఆయన బోధనలకు మంచి పేరుంది. వీటన్నింటికీ మించి ఇరాన్ శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) పూర్తి మద్దతు ఆయనకు ఉండటమే ఈ నియామకాన్ని సులభతరం చేసింది.


ఎదురు నిలిచిన అభ్యర్థులు వీరే..


ఈ పదవి కోసం మరో ఇద్దరు అభ్యర్థులు రేసులో నిలిచారు. ఒకరు క్లెరిక్ అలీరెజా అరాఫీ, మరొకరు విప్లవ పితామహుడు ఖొమేనీ మనుమడు సయ్యద్ హసన్ ఖొమేనీ. హసన్ ఖొమేనీ సంస్కరణవాదిగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. సైన్యం (IRGC) మొగ్గు మోజ్తబా వైపే ఉండటంతో ఆయన నియామకం ఖరారైంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న వేళ.. మోజ్తబా ఖమేనీ ఆ దాడులను ఎలా తిప్పికొడతారు, ఇరాన్ అస్తిత్వాన్ని ఎలా కాపాడతారు అన్నది ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa