ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌదీ అరేబియాలో క్షిపణి దాడికి ఇద్దరు బలి.. మృతుల్లో భారతీయుడు కూడా

international |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 07:44 PM

పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ జ్వాలలు అమాయక విదేశీ కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు దక్షిణాన ఉన్న అల్ ఖర్జ్ గవర్నరేట్‌పై జరిగిన శక్తివంతమైన క్షిపణి దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఇరాన్ తన పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై వరుసగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న క్రమంలోనే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం.


నివాస ప్రాంతమే లక్ష్యంగా దాడి..


సౌదీ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్ ఖర్జ్ ప్రాంతంలోని ఒక నివాస సముదాయంపై గుర్తుతెలియని "మిలిటరీ ప్రొజెక్టైల్" వచ్చి పడింది. ఈ దాడిలో అక్కడ నివసిస్తున్న ఇద్దరు విదేశీయులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ దాడికి ఇరానే కారణమని సౌదీ అధికారికంగా పేరు ప్రస్తావించనప్పటికీ.. గత వారం రోజులుగా ఇరాన్ జరుపుతున్న దాడుల పరంపరలో భాగంగానే ఇది జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


వ్యూహాత్మక లక్ష్యంగా అల్ ఖర్జ్..


అల్ ఖర్జ్ ప్రాంతం సౌదీ అరేబియాకు అత్యంత కీలకమైనది. ఇక్కడ భారీ వాయుసేన స్థావరం ఉండటమే దీనికి ప్రధాన కారణం. గత వారం రోజులుగా ఈ ప్రాంతంపై పదుల సంఖ్యలో దాడులు జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి.. దానికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా అనుకూల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈక్రమంలోనే బాంబులు, డ్రోన్ల వర్షం కురిపిస్తూ.. అమాయక ప్రజల ప్రాణాలు సైతం తీస్తోంది.


ఆందోళనలో కుటుంబ సభ్యులు..


ప్రస్తుతం గాయపడిన 12 మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన భారతీయ పౌరుడి వివరాలను సేకరించే పనిలో రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం నిమగ్నమైంది. బతుకుదెరువు కోసం దేశం కాని దేశం వెళ్లిన వ్యక్తిని.. ఇలా క్షిపణి దాడికి బలికావడంతో బాధితుడి స్వస్థలంలో విషాద ఛాయలు అలముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa