జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు శ్రీనగర్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగం కేసులో ఆయనపై గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసు విచారణలో భాగంగా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఫరూక్ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్‌ను శ్రీనగర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. తక్షణమే ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను మార్చి 30వ తేదీకి వాయిదా వేసింది.జేకేసీఏలో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఈ కేసులో నిందితులపై అభియోగాల నమోదు ప్రక్రియ కోసం గురువారం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగానే న్యాయస్థానం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. జేకేసీఏ అధ్యక్షుడిగా ఫరూక్ అబ్దుల్లా ఉన్న సమయంలో క్రికెట్ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించారని, భారీగా దుర్వినియోగం జరిగిందని ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ కుంభకోణంపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఫరూక్ అబ్దుల్లాతో పాటు పలువురిపై రణబీర్ పీనల్ కోడ్ ఆర్‌పీసీలోని సెక్షన కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.ఫరూక్ అబ్దుల్లాతో పాటు జేకేసీఏ మాజీ అధికారులు అహ్సాన్ అహ్మద్ మీర్జా, మహ్మద్ సలీం ఖాన్, బషీర్ అహ్మద్ మిస్గర్‌లను కూడా సీబీఐ నిందితులుగా చేర్చింది. కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టినట్టు దర్యాప్తులో తేలిందని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. చాలాకాలంగా కొనసాగుతున్న ఈ కేసులో, తాజా కోర్టు ఆదేశాలతో విచారణ ప్రక్రియ వేగవంతం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa