ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘లొంగిపోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది’: ,,,,డొనాల్డ్ ట్రంప్

international |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 06:33 PM

పశ్చిమాసియా యుద్ధంపై జీ-7 దేశాధినేతలతో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్- అమెరికా దాడులతో భారీగా దెబ్బతిన్న ఇరాన్ లొంగిపోవడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ అన్నట్టు అమెరికా మీడియా ఆక్సియోస్‌ నివేదించింది. కానీ, యుద్ధ లక్ష్యాలను, ఎప్పుడు ముగుస్తుందని అనేది మాత్రం చెప్పలేకపోయారని తెలిపింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఏర్పాటు చేసిన G-7 నేతల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్ లొంగిపోబోతుంది.. మనందర్నీ బెదిరిస్తున్న కేన్సర్‌ను నేను నిర్మూలించాను’’ అని సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య గురించి గొప్పలు చెప్పుకున్నారని అక్కడున్న వ్యక్తులు ఆక్సియోస్‌తో అన్నారు.


కానీ ఇరాన్ తాము లొంగిపోతున్నట్టు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన మర్నాడే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ తన తొలి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా తమ పోరాటం కొనసాగుతుందని శపథం చేశారు. హార్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ వైఖరిలో ఎటువంటి మార్పు ఉండబోదని, నౌకలను అడ్డుకోవడం కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో 20 శాతం ఈ జలసంధి ద్వారా రవాణా అవుతుంది. యుద్ధం కారణంగా మూసివేయడంతో చమురు, గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. క్రూడాయిల్ ధర 100 డాలర్లకు చేరుకుంది.


ఈ నివేదిక వచ్చిన కొద్ది గంటల్లో తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేస్తూ.. ‘ఇరాన్ ఉగ్రవాద పాలన సైన్యం, ఆర్థిక వ్యవస్థ సహా పూర్తిగా నాశనం చేశాం..’ అని తెలిపారు. ‘‘ఇరాన్ నేవీ పూర్తి ధ్వంసమైంది.. వారి వాయుసేన ఇక పోరాడలేదు.. క్షిపణులు, డ్రోన్లు అన్నింటినీ నాశనం చేశాం.. వారి నాయకులను భూమ్మీద లేకుండా చేశాం... మా వద్ద సాటిలేని సైనిశక్తి, అపరిమితమైన మందుగుండు సామాగ్రి, పూర్తి సమయం ఉన్నాయి. ఈ రోజు ఈ పిచ్చి వెధవలకు ఏం జరుగుతుందో చూడండి’’ అని ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శించారు.


అయితే, యుద్ధ తీవ్రతపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అలాగే, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడారు. ‘ఇప్పుడు వారికి నాయకుడు ఎవరో స్పష్టంగా తెలియదు.. అందుకే లొంగిపోతున్నట్టు ప్రకటన చేసే నేత ఎవరూ లేరు’ అని ఎద్దేవా చేశారు. కానీ, యుద్ధ లక్ష్యం ఏంటి? ఎన్నాళ్లు కొనసాగుతుంది? అనేది మాత్రం అమెరికా అధ్యక్షుడు స్పష్టత నివ్వలేదని నివేదిక తెలిపింది. యుద్ధం విషయంలో ట్రంప్ పొంతనలేని ప్రకటనలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఆయన పూటకో ప్రకటన చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa