మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాల పరంపరలో యువనాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మాజీ డిప్యూటీ సిఎం, ఎన్‌సిపి బారామతి ఎంఎల్‌ఎ అజిత్‌పవార్ మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ యోధుడు శరద్‌పవార్‌కు చిన్నాన్న కొడుకు. రోహిత్ పవార్‌కు కూడా చిన్నాన్న కొడుకు అవుతాడు. ఈ యువరాజకీయ నేత బిజెపి సిట్టింగ్ ఎమ్‌ఎల్‌ఎ, మంత్రి రామ్‌షిండేను కర్జత్ రాంఖెడ్ నుంచి ఓడించాడు. అజిత్ పవార్ భార్య సునేత్రా మేనల్లుడు రణజగ్జిత్ సిన్హా పాటిల్ తుల్జాపూర్ నుంచి బిజెపి టిక్కెట్‌పై ఎన్నికయ్యాడు. లాతూర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నేత, మాజీ సిఎం దివంగత విలాస్ రావు దేశ్‌ముఖ్ కుమారులైన సోదరులు అమిత్, ధీరజ్‌దేశ్‌ముఖ్ లాతూరు సిటీ, రూరల్ స్థానాల నుంచి ఎన్నికయ్యారు. ఎన్‌సిపిలో మరో బంధువర్గం బాబన్ షిండే మధ స్థానం నుంచి మళ్లీ ఎన్నిక కాగా, అతని సోదరుడు సంజయ్ షిండే కర్మల ఎన్‌సిపి అభ్యర్ధిగా గెలుపొందారు.శరద్‌పవార్ నాయకత్వం లోని సీనియర్ రాజకీయ నేత చగన్‌భుజ్‌బల్ నాసిక్ జిల్లా యోలా స్థానాన్ని తిరిగి సాధించుకున్నారు. అయితే అతని కుమారుడు పంకజ్ నందగావ్ నియోజక వర్గం నుంచి ఓటమి చవి చూశాడు. పర్లి సిటింగ్ ఎమ్‌ఎల్‌ఎ, మంత్రి పంకజముండే తన దాయాది,సీనియర్ ఎన్‌సిపి నేత ధనంజయ్ ముండే చేతిలో ఓడి పోయారు. నాసిక్ పశ్చిమ నియోజక వర్గంలో సీమా హిరే తన దగ్గరి బంధువు ఎన్‌సిపికి చెందిన అపూర్వహిరేను ఓడించారు. నిలింగ నియోజక వర్గంలో మంత్రి శంభాజీ పాటిల్ నిలంగేకర్‌కు, చిన్నాన్న అశోక్ నిలంగేకర్‌కు మధ్య పోరు సాగింది. అశోక్ నిలంగేకర్ విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి శివాజీరావు పాటిల్ నిలంగేకర్ కుమారుడు అశోక్ నిలంగేకర్. ఇదే విధంగా బీడ్ నియోజక వర్గంలో ఎన్‌సిపి అభ్యర్థి సందీప్ క్షేరసాగర్ తన చిన్నాన్న, మంత్రి జయ్‌దత్ క్షేరసాగర్‌ను ఓడించాడు. అహేరి నియోజక వర్గం నుంచి ఎన్‌సిపి అభ్యర్థి ధర్మారావు ఆత్రం తన చిన్నాన్న కొడుకు బిజెపి అభ్యర్థి అంబరీష్ ఆత్రం ను ఓడించాడు.నవతరానికి చెందిన నాయకుల్లో వారసత్వ రాజకీయాల్లో అడుగుపెట్టిన ఎన్‌సిపి నేత సునీల్ తత్కరే కుమార్తె అదితి శ్రీవర్ధన్ స్థానం నుంచి విజయం సాధించగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సుషీల్‌కుమార్ షిండే కుమార్తె ప్రణితి షిండే తన షోలాపూర్ సెంట్రల్ సిటీ స్థానాన్ని మూడోసారి సాధించుకోగలిగారు. పుసాద్‌లో ఎన్‌సిపి నాయకుడు మనోహర్ నాయక్ కుమారుడు ఇంద్రనీల్ తన దాయాది బిజెపి అభ్యర్థి నిలయ్‌ను ఓడించారు. దపోలిలో శివసేన మంత్రి రామ్‌దాస్ కదం కుమారుడు యోగేష్ , ముంబై లోని విఖ్రోలిలో శివసేన రాజ్యసభ ఎంపి సంజయ్ రౌత్ సోదరుడు సునీల్ రౌత్ విజయం సాధించారు.బహుజన్ వికాస్ అగాధి అభ్యర్థులు తండ్రీ కొడుకులు హితేంద్ర ఠాకూర్, క్షితిజ్ ఠాకూర్ క్రమంగా వసై, నలసోపర నియోజక వర్గాల నుంచి గెలుపొందారు. విజయం సాధించిన తండ్రీకొడుకుల కాంబినేషన్ లో కూడా రాష్ట్రం ప్రత్యేకత సాధించింది. వీరిలో ఒకరు ఎంపి కాగా, మరొకరు ఎంఎల్‌ఎ కావడం విశేషం. శివసేన నేత, మంత్రి ఏక్‌నాధ్ షిండే థానే లోని ఖోప్రి పచ్‌పక్డీ స్థానాన్ని తిరిగి సాధించుకోగా, ఆయన కుమారుడు శ్రీకాంత్ కల్యాన్ నుంచి ఎంపిగా ఉన్నాడు. కంకవ్లిలో నితేష్ రానే తన స్థానాన్ని తిరిగి దక్కించుకోగా, అతని తండ్రి నారాయణ్ రానే బిజెపి ఎంపిగా ఉన్నాడు. సంతోష్ దన్వే తన భోకర్దాన్ స్థానాన్ని దక్కించుకోగా, అతని తండ్రి రావూసాహెబ్ దన్వే జైనా ఎంపి యే కాకుండా కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. రాధాక్రిష్ణ విఖే పాటిల్ తన షిరిడి స్థానం నుంచి గెలుపొందగా, అతని కుమారుడు సుజయ్ విఖే పాటిల్ అహ్మద్ నగర్ బిజెపి ఎంపిగా ఉన్నారు.భార్యాభర్తల ఎమ్‌ఎల్‌ఎ, ఎంపి కాంబినేషన్ కూడా ఈ రాష్ట్రంలో కనిపించింది. ఇండిపెండెంట్ అభ్యర్థి రవి రాణా, తన బద్నేరా అసెంబ్లీ స్థానాన్ని సాధించుకోగా, అతని భార్య నవ్‌నీత్ రాణా అమ్రావతి ఎంపిగా ఉన్నారు. లోనె లోక్‌సభ కాంగ్రెస్ ఎంపి సురేష్ ధనోర్కర్ భార్య ప్రతిభ వరోరా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. కొలబా నుంచి బిజెపి ఎంఎల్‌ఎ గా రాహుల్ నర్వేకర్ విజయం పొందగా, ఆయన మామ రామ్జ్రే నాయక్ నింబాల్కర్ ఎన్‌సిపి నాయకుడే కాక, లెజిస్లేటివ్ కౌన్సిలు ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. దివంగత కాంగ్రెస్ నాయకుడు పతంగరావు కడం కుమారుడు విశ్వజిత్ కడం పలుస్ కడెగావ్ నుంచి విజయం సాధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa