ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా నిధుల పద్దులకు నిబద్దులగా పని చేద్దాం: పయ్యావుల కేశవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 07, 2019, 09:51 PM

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తున్న నిధులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరాలని ప్రజా పద్దుల కమిటి చైర్మెన్ పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. తొలి ప్రజా పద్దుల కమిటి సమావేశం గురువారం ఇన్‌చార్జి సిఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రజా పద్దుల కమిటి సభ్యులు ఎమ్మెల్సీ బాల సుబ్రహ్మణ్యం, బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మేరుగ నాగార్జునలు హాజరయ్యారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం 1919 వ సంవత్సరంలో తొలిసారి ప్రజా పద్దుల కమిటిని ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పట్లో అధికార పక్షం వారే ఉండే వారని కాలానుగుణంగా దానిని 1967 వ సంవత్సరంలో ప్రతిపక్ష నేతలకు సంప్రదాయ పద్ధతిలో కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో 2011-12 మధ్య కాలంలో ఖర్చుల పద్దుల దగ్గర నుంచి 2018-19 మధ్య కాలం ఖర్చుల వరకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని ఛైర్మెన్ పయ్యావుల కేశవ్ అధికారులకు సూచించారు. తొలిగా ఇన్ చార్జి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమావేశంలో అధికారులను ఛైర్మెన్ కు పరిచయం చేశారు. అనంతరం అధికారుల నుంచి సలహాలు, సూచనలను కమిటి స్వీకరించింది. గతంలో బడ్జెట్ తక్కువగా ఉండేదని, ప్రస్తుతం బడ్జెట్ రూ.2 లక్షల కోట్లకు చేరిందని... దీంతో ప్రజా పద్దుల కమిటి బాధ్యతలు మరింత పెరిగాయన్నారు. సంబధిత అధికారులు తమ శాఖల్లో మరింత బాధ్యతగా పని చేయాలని కోరారు.
ప్రధానంగా అన్ని శాఖలు ప్రజా పద్దులను సక్రమంగా ఖర్చు చేసిన లెక్కలు చూపాలని కోరారు. ప్రభుత్వ విధానాలను అవలంబిస్తునే, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు. నిధుల వినియోగం తరువాత లెక్కల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరం అనుకుంటే ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యా,వైద్యం, భవనాలు, రహదారులు మరియు వ్యవసాయం, సాధారణ నిధుల్లో ఖర్చుల సమస్యలు వస్తున్నాయన్నారు. అధికారులు అన్ని అంశాలపై త్వరితగతిన సమస్యలు లేకుండా పద్దుల లెక్కలు చూపాలని కోరారు. సిఐజి ఆధ్వర్యంలో బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరారు.
ప్రస్తుతం పుర్తిస్థాయి కమిటీ వచ్చాక మరోసారి చర్చిద్దామన్నారు. పాత విషయాలను త్వరిత గతిన పూర్తి చేసి కొత్త లెక్కలు కమిటికి తెలపాలన్నారు. కమిటీలో సభ్యులైన ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో దూరదృష్టితో పని చేస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. అధికారులు కూడా అంతే సమర్థవంతంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ బాల సుబ్రహమణ్యం మాట్లాడుతూ, ప్రజా పద్దుల విషయంలో ఉన్న అవకాశాలను అధికారులకు అందిపుచ్చుకొని తదనుగుణంగా పని చేయాలని కోరారు. ఎమ్మెల్సీ బీద రవీంద్ర మాట్లాడుతూ, గతంలో తానూ, ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కమిటిలో పని చేశానన్నారు. ఆయా శాఖల అధికారులు సాధ్యమైనంతవరకు త్వరితగతిన పద్దుల వివరాలు పూర్తి చేయాలని పిలుపు నిచ్చారు. చిన్న చిన్న సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. ఒకే అంశం పలుమార్లు వస్తుందని అలా రాకుండా చూడాలని కోరారు. సమయం వచ్చినప్పుడు పెద్ద సమస్యలపై సమీక్ష చేద్దామన్నారు. ఇన్ చార్జి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతీ సమాచారాన్ని కమిటి ముందు ఉంచడం జరిగిందన్నారు. పరిష్కార మార్గాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల్లో నివేదికలను తయారు చేసుకొని వారం రోజులు ముందుగా కమిటికి పంపాలని కోరారు.
పరిశీలన అనంతరం అందులోని సమస్యలపైన మాత్రమే అధికారులతో చర్చించడానికి వీలుంటుందన్నారు. పద్దుల్లో వచ్చిన ఇబ్బందులకు దాటవేత ధోరణిని ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ సహాయ కార్యదర్శి డి.సాంబశివరావు, రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.వి సత్యనారాయణ, సంబంధిత శాఖల ప్రధాన కార్యదర్శులు,కమిషనర్లు, డైరక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa