టిటిడికి అనుబంధంగా ఉన్న దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా విష్వక్సేనారాధన, భగవత్ పుణ్యాహం, సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహించారు. ఈ ఆలయంలో పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తారు.
అష్టబంధన మహాసంప్రోక్షణలో భాగంగా నవంబరు 8న ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాస్తుహోమం, సాయంత్రం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు అగ్నిప్రతిష్ట, కుంభస్థాపనం, చతుష్టానార్చన నిర్వహిస్తారు. నవంబరు 9న ఉదయం 8 నుండి 10 గంటల వరకు వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 3.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు మహాభిషేకము, తత్త్వన్యాస హోమాలు, శయనాధివాసం జరుగనున్నాయి.
నవంబరు 10న ఉదయం 7 గంటకు మహాపూర్ణాహుతి, ఉదయం 8 నుండి 9 గంటల లోపు వృశ్చిక లగ్నంలో మహాకుంభాభిషేకం, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, రాత్రి 8 నుండి 10 గంటల వరకు గ్రామోత్సవం నిర్వహిస్తారు.
పాంచరాత్ర ఆగమ వైశిష్ట్యం
సాక్షాత్తు భగవంతుడే ఉపదేశించినది పాంచరాత్ర ఆగమం. భగవంతుని చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు. భగవంతుడిని ఎలా అర్చించాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఏడాదిలో జరిగే నిత్యము, నైమిత్తికము, కామ్యము అనే ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, కంకణబట్టార్ ఎలాంటి అధ్యయనం చేయాలి, ఉత్సవాలు నిర్వహించే యజమానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను ఆగమాలు తెలియజేస్తున్నాయి. పాంచ అంటే ఐదు, రాత్ర అంటే రోజులు అని అర్థం. భగవంతుడు ఐదు రోజుల పాటు నాగరాజు అయిన అనంతుడు, గరుత్మంతుడు, విష్వక్సేనమూర్తి, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే ఐదుగురికి ఉపదేశించినవి కావున దీనికి పాంచరాత్రం అనే పేరు వచ్చింది. ఇది అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లోకంలో ప్రతిజీవి పునరావృత్తి రహిత శ్రీవైకుంఠానికి చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు పాంచరాత్రం దోహదపడుతుంది.