ఉత్తర్ ప్రదేశ్ భగ్గున మండుతోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఉత్తర్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. డజనుకు పైగా జిల్లాల్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, పారామిలటరీ బలగాలపైకి ఆందోళనకారులు దాడులకు పాల్పడుతున్నారు. రాళ్లు రువ్వుతున్నారు. ఈ రాళ్లదాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. చాలాచోట్ల వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసుల లాఠీఛార్జీ, ఆందోళనకారుల ఎదురుదాడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ సహా పలు జిల్లాల్లో ఆందోళనకారులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. కనిపించిన వాహనాలను కనిపించినట్లుగానే నిప్పంటిస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలను చేస్తున్నారు. రాళ్లు, కర్రలు పట్టుకుని గుంపులుగుంపులుగా తిరుగుతూ కనిపించారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి ప్రయత్నించిన పోలీసులు, పారా మిలటరీ బలగాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.
గోరఖ్ పూర్, ఫిరోజాబాద్, బులంద్ షహర్, చందౌసీ, సంబల్, హాపుర్, బహ్రయిచ్, లక్నో, ఘజియాబాద్, కన్పూర్ వంటి జిల్లాల్లో అల్లర్ల తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి- గోరఖ్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు మిన్నంటాయి. చాలా ప్రాంతాల్లో ఆందోళనకారులు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడ్డారు. కొందరు స్థానికులపైనా దాడులకు పాల్పడినట్టు సమాచారం ఉన్నప్పటికీ.. అధికార వర్గాలు గానీ, పోలీసులు గానీ దీన్ని ధృవీకరించలేదు.శుక్రవారం ప్రార్థనల అనంతరం పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ముందే ఊహించారు. దీనికి అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ ను విధించారు. ఈ ఉదయం 7 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ.. పలు చోట్ల ఆందోళనకారులు గుమి కూడటం, ధర్నాలు, నిరసన ప్రదర్శనలకు తెర తీశారు. రోడ్లపై బైఠాయించారు.
గోరఖ్ పూర్, బులంద్ షహర్, కాన్పూర్, ఘజియాబాద్ వంటి సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినట్టు కనిపిస్తోంది. పోలీసులు, ఆందోళనకారులు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఆయా ప్రాంతాల్లోపోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పలువరు ఆందోళనకారులను అరెస్టు చేశారు. అయినప్పటికీ.. పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. దీనితో కేంద్రం నుంచి మరిన్ని ప్లటూన్ల పారామిలిటరీ బలగాలను పంపించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa