బెంగాల్ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బెంగాల్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌లు విస్తరిస్తున్నాయంటూ అమిత్ షా వ్యాఖ్యానించడం పూర్తిగా రాజకీయ ప్రేరితమని మమత మండిపడ్డారు. బెంగాల్‌లోనే ఉగ్రవాదులు ఉంటే, పహల్గాం, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు ఎవరు చేశారో చెప్పాలని ఆమె సూటిగా ప్రశ్నించారు.అలాగే, బెంగాల్ ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే సరిహద్దుల్లో కంచె నిర్మాణం జరగడం లేదన్న అమిత్ షా వ్యాఖ్యలను కూడా మమత తీవ్రంగా ఖండించారు. పెట్రాపోల్, చంగ్రబంధ సరిహద్దుల్లో ఇప్పటికే తమ ప్రభుత్వం అవసరమైన భూమిని కేంద్రానికి అప్పగించిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంవల్లే అనేక రైల్వే ప్రాజెక్టులు బెంగాల్‌కు వచ్చాయని గుర్తు చేశారు. బీజేపీ నేతలు కావాలనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అలాంటి మాటలను బెంగాల్ ప్రజలు ఎప్పటికీ నమ్మరని మమత స్పష్టం చేశారు.ఇక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ‘ఎస్‌ఐఆర్’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర పన్నుతోందని మమత తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఇంత హడావిడిగా ఎందుకు చేపడుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక పలువురు బూత్ లెవల్ అధికారులు, ఇతర సిబ్బంది మానసిక ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఓటర్ల జాబితా సవరణ పేరుతో సుమారు 1.5 కోట్ల మంది పేర్లను తొలగించేందుకు ప్రయత్నం జరుగుతోందని మమత ఆరోపించారు. ముఖ్యంగా ఆదివాసీలు, అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రక్రియను నడుపుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఇలాంటి చర్యలను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, బెంగాల్ ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాడతామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa