ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్య్సకారులకు కరోనా దెబ్బ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 07, 2020, 11:55 AM

ఆక్వా ఉత్ప‌త్తుల్లో దేశంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రథమ స్థానంలో ఉంది. కేర‌ళ నుంచి బెంగాల్, ప‌శ్చిమ తీరాన గుజరాత్ వ‌ర‌కూ 9 రాష్ట్రాల్లో ఆక్వా సాగు జ‌రుగుతోంది. అందులో రొయ్య‌లు, చేప‌ల ఉత్ప‌త్తిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్ని రాష్ట్రాల కంటే ముందుంటుంది. విదేశాల‌కు జ‌రిగే ఎగుమ‌తుల్లో మూడింట రెండు వంతులు ఒక్క ఏపీ నుంచే జ‌రుగుతుంటాయి. దానికి త‌గ్గ‌ట్టుగా విదేశీ మార‌క ద్ర‌వ్యం కూడా ల‌భిస్తోంది. కానీ, ఇప్పుడు ఎగుమ‌తులు నిలిచిపోవ‌డం, ప్రోసెసింగ్ యూనిట్లు మూత‌ప‌డ‌డం, రొయ్య‌ల చెరువుల వ‌ద్ద కూలీల కొర‌త కూడా వేధిస్తుండ‌డంతో ఆక్వా సాగుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైజాగ్ లో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు లాక్ డౌన్ మత్స్య పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసింది. విశాఖ నుంచి కేరళ, కర్నాటక, మహారాష్ట్ర ఒడిశా, భువనేశ్వర్, వెస్ట్ బెంగాల్, బీహార్, తమిళనాడు, పాట్నా తదితర ప్రాంతాలకు చేపలను రవాణా చేస్తారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఆయా ప్రాంతాలకు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో వేలాది మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. వాటి రవాణపై ఆధారపడిన అనేక మంది పూటగడవని పరిస్థితితో అవస్థలు పడుతున్నారు. మరో వైపు అరకొర లభ్యమవుతున్న చేపలకు మార్కెట్లో మండి డిమాండ్ ఏర్పడింది. చేపల వేట నిషేధం వల్ల చేపలు ఇష్టపడేవారు.. లాక్ డౌన్ సడలింపు అనంతరం చేపల కోసం అర్రులు చాస్తున్నారు. దీంతో చేపలకు డిమాండ్ పెరిగింది. దీంతో ధర కూడా అమాంతం పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో ఒక కేటు (38 కేజీలు) కవళ్ల ధర రూ. 1000 ఉంటే.. ఇప్పుడు ఆ ధర రూ 2500కు పెరిగింది. ప్రస్తుతం కేరళకు ఎగుమతి చేస్తున్నారు. కనగడతలు..80 చేపలు ధర రూ. 1500 గత ఏడాది ఉంటే, ఈ సంవత్సరం ఆ ధర రూ 2500 పెరిగింది. మాంస ప్రియులు ఎంతో ఇష్టపడే కోనాం రకం చేప ధర 5-10 కేజీలు ధర గతేడాది రూ. 400 ఉంటే, ఈ ఏడాది ఆ ధర రూ 600 నుంచి 700 పెరిగింది.


నెల్లూరులో దెబ్బతిన్న ఆక్వా రైతులు.. నెల్లూరులో ఆక్వా రైతులు లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఎగుమతులు పూర్తిగా ఆగిపోవడంతో కేవలం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు నుంచి ఎక్కువగా చెన్నై, కేరళ బెంగళూరు పాటు విదేశాలకు కూడా ఎగుమతులు జరుగుతాయి. ప్రస్తతుం రొయ్యల ధర 100 కౌంట్ రూ. 200, 90 కౌంట్ రూ. 210, 80 కౌంట్ రూ. 220, 70- రూ. 230, 60-రూ. 250, 50-రూ. 270, 40-రూ. 300, 30-రూ. 380, 20- రూ. 500 ఉంది. ఎగుమతలకు ఆంక్షలు ఉండడంతో ప్రస్తుతం వీరు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆశించిన డిమాండ్ లేక ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. రొయ్యల సాగుతో ప్రస్తుం కేవలం పెట్టుబడి మాత్రమే వస్తుందని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోయ్యల సాగుకు సరాసరి పెట్టుబడి కేజీకి రూ. 160 నుంచి రూ. 170 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ గండి, బొచ్చి చాపల ధర ప్రస్తుతం రూ. 150 నుంచి రూ. 200 వరకు పలుకుతుంది. లాక్ డౌన్ నేపథ్యంలో స్థానికంగా వీటికి మంచి డిమాండే ఉన్నా.. ఎగుమతి చేసే పరిస్థితి మాత్రం లేదు.


ప.గో జిల్లాలో ఇదీ పరిస్థితి.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిత్యం 250 నుంచి 300 లారీల చేపలు ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. భీమవరం, ఆకివీడు, చేబ్రోలు కేంద్రాలుగా చేపల ఎగుమతి జరుగుతోంది. ముఖ్యంగా అసోం, ఒడిశా, పశ్చిమబంగ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం వాటితోపాటు మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు చేపలను దిగుమతి చేసుకునే పరిస్థితి లేదని సమాచారం. దీంతో చేపల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.


పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు : రైతు ఆవేదన ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు మాట్లాడుతూ.. ‘నేను 40 ఎక‌రాల్లో రొయ్య‌ల చెరువు వేశాను. ప్రస్తుతం 40 కౌంట్ ఉంది. మ‌రో ప‌ది రోజుల్లో ప‌ట్టాల్సి ఉంది. కరోనా వైర‌స్ ప్ర‌భావం అధికంగా ఉంది. మా చుట్టుప‌క్క‌ల చాలా చోట్ల సిద్ద‌మైన త‌ర్వాత చేజారిపోయాయి. మాకు కూడా అలానే జరుగుతుందేమోనని భయమవుతున్నాయి. ఈ సమయంలో రొయ్యలు ప‌డితే తీసుకెళ్లేవారు లేరు. ధ‌ర‌లు బాగా పడిపోయాయి. ఫిబ్ర‌వ‌రి నెల ప్రారంభంలో 30 కౌంట్ కిలో రొయ్య రూ.480 ఉండేది. ఇప్పుడ‌ది కిలో రూ.250కి కూడా కొనడం కష్టంగా మారింది. ఎవ‌రైనా కొన్నా ప్రోసెసింగ్ యూనిట్లు మూత‌ప‌డ్డాయ‌ని చెబుతున్నారు. చెరువులు కాపాడుకుందామ‌ని ప్రయత్నిస్తే కూలీలు భయపడి రావడం లేదు. మా ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యు అన్నట్టుగా మారింది. ల‌క్ష‌ల రూపాయలు పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం పెట్టుబడి కూడా చేతికి వచ్చే ఆశ కనిపించడం లేదు" ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa