ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు నడిబొడ్డున బెజవాడ తరహా గ్యాంగ్ వార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 09, 2020, 11:20 AM

విజయవాడ గ్యాంగ్ వార్ తరహాలో గుంటూరు నగరంలో మరో ఘటన కలకలం కలిగించింది. విజయవాడ గ్యాంగ్ వార్ పై పోలీసుల దర్యాప్తు సాగుతున్న వేళ మరోఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాలేజీ విద్యార్థుల మధ్య ఇన్ స్టా గ్రాంలో  ఒక అమ్మాయి పరిచయం వలన ఏర్పడిన వివాదమే గొడవకు దారితీసింది. స్థానిక అరండల్‌పేట పిచ్చుకలగుంట వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.


ఒక యువతి కోసం ఇద్దరు యువకులు వారి స్నేహితులతో రెండు గ్రూపులుగా విడిపోయి, ఘర్షణకు దిగడంతో అలజడి వాతావరణం ఏర్పడింది.  గుంటూరు రూరల్‌ చౌడవరం సమీపంలోని ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో వసంతరాయపురానికి చెందిన ప్రణయ్‌ బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నగరంలోని బృందావన్‌ గార్డెన్స్‌కు చెందిన ఒక విద్యార్థిని అతడికి స్నేహితురాలు. ఆమెకు ఇన్‌స్ట్రాగామ్‌లో అకౌంట్‌ ఉండటంతో, కృష్ణనగర్‌కు చెందిన ఆవుల దివేష్‌ అలియాస్‌ సన్ని మేసేజ్‌లు పంపుతుండేవాడు. సన్నీ పంపుతున్న మేసేజ్‌ల విషయాన్ని సదరు విద్యార్థిని ప్రణయ్‌కు చెప్పడంతో సాంకేతిక మాధ్యమాల ద్వారా ఇద్దరి మధ్య వివాదం నెలకొంది.


మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దమ్ముంటే చూసుకుందాం రమ్మంటూ..ఇద్దరూ ఫోన్‌ నంబర్లు పంపుకున్నారు. విషయంపై తేల్చుకుందాం రమ్మంటూ..డొంకరోడ్డు వద్ద ముందుగా ప్రదేశాన్ని ఖరారు చేసుకున్నారు. డొంక రోడ్డు 6వ లైను వద్ద రెండు వర్గాలు కలిపి సుమారు 40 నుంచి 50 మంది విద్యార్థులు, యువకులు చేరడంతో అక్కడ స్థానికులు కేకలు వేశారు. అక్కడ నుంచి పిచ్చుకులగుంట వద్ద బాహాబాహీకి  సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న అరండల్‌పేట స్పెషల్‌ బ్రాంచి కానిస్టేబుల్, ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సిబ్బందిని ఘటన స్థలానికి పంపేసరికి ఘర్షణ వాతావరణం నెలకొంది.


అక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులతో పాటు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సమాచారం వేగవంతంగా తెలియడం, సిబ్బంది త్వరితగతిన స్పందించడంతో ఎటువంటి ఘటనలు జరగకపోవడంతో పోలీసులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఘర్షణకు వచ్చిన వారిలో గుంటూరు రూరల్‌ జిల్లా పరిధిలోని ఒక స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐ కుమారుడు ఉన్నట్లు సమాచారం. 


యువతి విషయంలో విద్యార్థుల ఘర్షణపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అరండల్‌పేట పీఎస్‌లో ఉన్న విద్యార్థులు, యువకులను సోమవారం అడిషనల్‌ ఎస్పీ డి. గంగాధరం, వెస్ట్‌ డీఎస్పీ బి.వి. రామారావు, స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు విచారించారు. ఘర్షణలకు కారణమైన వాస్తవాలను వెలికి తీసేందుకు విచారణ చేపట్టారు.


యువతి విషయంలోనే ఘర్షణ లేక..ఇతరత్రా ఏమైనా ఉన్నాయా... ఘర్షణ సమయంలో ఉన్న విద్యార్థులు కాకుండా, ఇతరత్రా ఉన్న యువకులపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని ప్రణయ్ గ్యాంగ్ పరుగు లంకించుకుని తప్పించుకున్నారు. పోలీసులు తప్పించుకున్న గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో గ్యాంగ్ వార్.. గుంటూరు గ్యాంగ్ వార్ ఇలా యువత రెచ్చిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa