రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ, న్యాయవ్యవస్థపై దాడిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి, తనకు సహకరించేవారికి కోట్లాదిరూపాయల ప్రజల సొమ్ముని దోచిపెడుతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. ప్రభుత్వం తరుపున అదనపు అడ్వకేట్ జనరల్‌గా ఉన్న జాస్తి నాగభూషణం అర్హతేమిటో, ఆయనకున్న అనుభవమేమిటో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సరి సమానంగా నాగభూషణానికి అదనపు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఫీజుల పెంపుకు ఒకసారి, సౌకర్యాల పెంపుకు మరోసారి, కేసుల సంఖ్య పెంపునకు ఇంకోసారి అనేక జీవోలు నాగభూషణం కొరకు జారీ చేసి, లక్షలు దోచిపెడుతున్నది వాస్తవంకాదా? అని నిలదీశారు.
ఉమ్మడి హైకోర్టులో గానీ, విభజన తర్వాత ఏర్పడిన ఏపీ హైకోర్టులో గానీ నాగభూషణం వేసిన వకాలత్‌లు ఎన్ని అని ఆయన అడిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, అనేక రాష్ట్రాల్లో గానీ ఇద్దరు అదనపు అడ్వకేట్ జనరళ్లను నియమించిన దాఖలాలు లేవన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన జాస్తి చలమేశ్వర్ కుమారుడు కావడమే నాగభూషణానికున్న ఏకైక అర్హత అని అన్నారు. అమరావతి భూములకు సంబంధించి జగన్ ప్రభుత్వం నమోదు చేసిన తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లో ఆనాటి సుప్రీం కోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యుల పేర్లను అక్రమంగా చేర్చారని మండిపడ్డారు. ఆ వ్యవహారంలో సహకరిస్తాడనే సెప్టెంబర్ 22, 2020న జాస్తి నాగభూషణాన్ని వెంటబెట్టుకొని మరీ జగన్ రెడ్డి ప్రత్యేక విమానంలోఢిల్లీకి తీసుకెళ్లలేదా అని ప్రశ్నించారు. గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేస్తూ జగన్ లేఖ రాయడం వెనుక, చలమేశ్వర్ నాగభూషణాల హస్తం లేదా అని నిలదీశారు.
తాను చేసే రాజ్యాంగవిరుద్ధ పనులకు సహకరిస్తున్నాడనే జగన్ రెడ్డి చలమేశ్వర్ కుమారుడు నాగభూషణాన్ని అదనపు అడ్వకేట్ జనరల్‌గా నియమించారన్నారు. తనపై ఉన్నఅవినీతి కేసులు రుజువై, ఎక్కడ జైలుకెళతానోనన్న భయంతోనే జగన్మోహన్ రెడ్డి, చలమేశ్వర్, నాగభూషణాల సహకారంతో నేరుగా న్యాయవ్యవస్థపై దాడికి దిగారని అన్నారు. ఆ విధంగా వారిమధ్యన అవినాభావ సంబంధం ఏర్పడిందని తెలిపారు. 2019 జనవరి నుంచి ఒక్క వకాలత్ కూడా వేయని నాగభూషణం, అదనపు అడ్వకేట్ జనరల్ హోదాలో ఎవరిపై తప్పుడు కేసులు పెట్టాలనే సలహాలిస్తుంటారని విమర్శించారు. రాజ్యాంగ వ్యతిరేకమైన పనులకు ముఖ్యమంత్రికి సహకరిస్తున్నాడనే నాగభూషణానికి ప్రభుత్వం లక్షలకు లక్షలు దోచిపెడుతోందని ఆరోపించారు. జాస్తి నాగభూషణం ఏం ఉద్ధరించాడని ఈ ముఖ్యమంత్రి అతనికి ప్రజల సొమ్ముని దోచిపెడుతున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తాను చేసే తప్పులకు సహకరిస్తున్నవారికి, ప్రజాధనాన్ని దోచిపెడుతున్నాడనటానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని అని పట్టాభి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa