ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడవి బిడ్డలకు తప్పని కష్టాలు..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 12:51 PM

రాయనక రప్పనక, రేయనక పగలనక, పురుగు పుట్టలతో అప్రమత్తంగా మెలుగుతూ మరో ప్రపంచం తెలియని అడవి బిడ్డలు కనీన మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. కొండ కోనలే నివాసాలుగా.. జంతుజాలాలే నేస్తాలుగా.. ప్రకృతితో సహవాసం చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో ఎవరికైనా అనారోగ్యం చేస్తే బయటకు వచ్చే 'మార్గం' లేక సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. మైదాన ప్రాంతానికి వచ్చేందుకు సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు పట్టించుకుని 'దారి' చూపాలని వేడుకుంటున్నారు.


విజయనగరం జిల్లా కురుపాం మండలంలోని నీలకంఠాపురం పంచాయతీ భీంపురం గిరిజన గ్రామం సమీపంలో ఐటీడీఏ అధికారులు స్పందించి గెడ్డపై వంతెన నిర్మించకుంటే అత్యవసర వైద్యసేవలందక ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని రెండు జిల్లాలకు చెందిన 220 గ్రామాల గిరిజన ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఐటీడీఏ అధికారులకు భీంపురం గ్రామ సమీపంలో రహదారితో పాటు వంతెన నిర్మించాలని వినతులు సమర్పించినా స్పందన లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వంతెన నిర్మాణం జరిగితే కురుపాం మండలంలోని భీంపురం, నీలకంఠాపురం, వాడకొయ్యి, సుక్కుగూడ, జరడ, గాణలి, తిత్తిరి, వాడకొయ్యి, నీలకంఠాపురం, ఒబ్బంగి తదితర గ్రామాలు అలానే శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలానికి చెందిన గురండి, ఈతమానుగూడ, సరాబువలస, పుట్టిగాడిగూడ, కోమటిగూడ, సీడుమానుగూడ, బంజరుగూడ, నెల్లిగూడ, సావిసివలస, చినబగ్గ తదితర గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.


రహదారి లేక మృత్యువాత


భీంపురం వద్ద వంతెన నిర్మాణం కాకపోవడంతో గడిచిన ఐదేళ్లలో అత్యవసర వైద్య సేవలు అందక ఐదుగురు గిరిజనులు మృత్యువాత పడ్డారు. తీవ్ర అనారోగ్యానికి గురైన భీంపురం గ్రామానికి చెందిన బిడ్జిక మాలమ్మ(65), బిడ్డక సుబ్బారావు (20). మోహన్రావు (45), కామేశ్వరరావు (30), బిడ్డక అప్పలస్వామి (45)లను డోలీలో తీసుకు వెళ్తుండగా మార్గమధ్యంలోనే మృత్యువాత పడ్డారని చెబుతున్నారు. రెండేళ్ల కిందట మృతి చెందిన నెలరోజుల పసిపాప కూడా సమయానికి వైద్య సేవలందకే ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నాబార్డ్ నిధులతో గతంలో రహదారి నిర్మాణం


నాబార్డ్ నిధులతో కురుపాం మండలంలోని పొక్కిరి గిరిజన గ్రామం నుంచి శ్రీకాకుళం జిల్లా సరిహద్దులో ఉన్న ఈతమానుగూడ వరకు రూ. కోటి తో ఆర్ అండ్ బీ రహదారి నిర్మించినప్పటికీ మార్గమధ్య లో గెడ్డపై వంతెన నిర్మించకపోవడంతో ఇటు విజయనగరం, అటు శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు రాకపోకలు, వైద్యసేవలు, రవాణా సదుపాయం పూర్తిగా స్తంభించి పోయాయి. గిరిశిఖర గ్రామాల ప్రజలు వైద్యసేవల కోసం డోలీనే 108 వాహనంగా చేసుకుని కురుపాం మండలంలోని నీలకంఠాపురం. లేదా శ్రీకాకుళం జిల్లాలోని ఇతర ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa