సమాజంలో రానురానూ తాళిని ఎగతాళి చేస్తూ.. పవిత్రమైన వివాహ బంధానికి మాయని మచ్చ తెస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. కొందరు క్షణిక సుఖాల మోజులో పడి కాపురాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. నిండు జీవితాలను మొగ్గలోనే తుంచేసుకుంటున్నారు. అలాంటి ఓ వివాహితకు సంబంధించిన ఘటనే ఇది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. చిత్రదుర్గ జిల్లా కెంకెరె గ్రామానికి చెందిన దివ్య అనే 22 ఏళ్ల యువతిని ఆమె తల్లిదండ్రులు ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి జరిపించారు. పెళ్లయిన కొన్నాళ్లు కొత్త జంట అన్యోన్యంగానే ఉన్నారు. పెళ్లయి సంవత్సరం కూడా గడుస్తుందో లేదో దివ్య మంజునాథ్ అనే మరో యువకుడితో పరిచయం పెంచుకుంది. ఇద్దరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తతో ఉండేందుకు ఏమాత్రం ఇష్టపడని దివ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ప్రియుడితో కలిసి మూడు నెలల క్రితం వెళ్లిపోయింది. భర్త తిరిగి ఆమెను తీసుకొచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అతనూ పట్టించుకోలేదు.
మూడు నెలల నుంచి దివ్య తన ప్రియుడితో కలిసి ఉంటోంది. అయితే కొన్ని రోజులుగా దివ్య జ్వరంతో బాధపడుతోంది. ఆమె నమ్మి వచ్చిన ప్రియుడు పట్టించుకోవడం మానేశాడు. ఆమెకు కనీసం వైద్యం కూడా చేయించలేదు. దీంతో దివ్య ఓ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. ఆమె సూసైడ్ లెటర్‌లో ప్రియుడు చేసిన దారుణాలను చెప్పుకొచ్చింది. మంజునాథ్ తనను తిట్టికొట్టి హింసించాడని.. అతను పెడుతున్న చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్‌లో దివ్య రాసింది. చిత్రదుర్గ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్తను కాదనుకుని ప్రియుడిని నమ్ముకుని అతనితో కలిసి వెళ్లిన దివ్య జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa