దేశంలో నిబంధనలు పాటించని బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఇఫ్ ఇండియా (RBI) కొరఢా ఝులిపిస్తోంది. తమ ఆదేశాలను పట్టించుకోని బ్యాంకుల లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు, భారీగా జరిమానా విధిస్తోంది. అంతేకాకుండా మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తోంది. తాజాగా దేశంలో మరో బ్యాంకుకు షాకిచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెన్స్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. తాము జారీ చేసిన ఆదేశాలను, నిబంధనలను పాటించనందుకు బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఇవి ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంటూ సంచలన నిర్ణయం తీసుకుంది.
సదరు బ్యాంకు ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని గతేడాది ఆంక్షలు మాత్రమే విధించామని ఆర్‌బీఐ తెలిపింది. తమ ఆదేశాలతో ఆరు నెలల పాటు వినియోగదారులు తమ ఖాతాల నుంచి విత్‌డ్రా చేసుకునే సేవలు నిలిచిపోయాయని పేర్కొంది. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ఆ బ్యాంకు ఆర్థిక పరిస్థితులు ఏ మాత్రం మెరుగుపడలేదని వివరించింది. దీంతో లైసెన్స్ రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలియజేసింది. బ్యాంకు వద్ద అవసరమైన మూలధనం లేదని, సమీప భవిష్యత్తులో ఆదాయాలు పెరిగే మార్గాలు కూడా ఆ బ్యాంకుకు లేవని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేసినట్లు తెలిపింది.
అయితే ఖాతాదారుల, డిపాజిటర్లకు ఊరట కలిగేలా ఆర్‌బీఐ ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనల ప్రకారం కస్టమర్ల డిపాజిట్లను తిరిగి వెనక్కి ఇచ్చేయాలని సదరు బ్యాంకుకు సూచించింది. రూ.5 లక్షల లోపు డిపాజిట్లు చేసిన వారికి వెంటనే డబ్బులు ఇచ్చేయాలని ఆదేశాలిచ్చింది. రూ.5 లక్షలు, ఆలోపు డిపాజిట్ చేసిన ఖాతాదారులందరికీ పూర్తిగా డబ్బులు వెనక్కి వస్తాయని ఆర్బీఐ భరోసానిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa