ఓ న్యాయమూర్తి తన తీర్పులోనే కాదు రిటైయిడ్ మెంట్ కు ఒక రోజు ముందు రాజీనామా చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. పలు లైంగిక వేధింపులు కేసుల్లో వివాదాస్పద తీర్పులిచ్చిన బాంబే హైకోర్టు మహిళా జడ్జ్ పుష్ప గనేడివాలా రాజీనామా చేశారు. గురువారం బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తి పదవికి రిజైన్ చేశారు. నిజానికి ఫిబ్రవరి 12తో ఆమె పదవీ కాలం ముగియనుంది. కానీ ఒక్క రోజు ముందు ఆమె రాజీనామా చేశారు. ప్రస్తుతం జస్టిస్ పుష్ప గనేడివాలా బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్‌లో అదనపు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గత ఏడాదిలో పలు కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇవ్వడంతో సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ గనేడివాలాను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలనే దాని సిఫార్సును ఉపసంహరించుకుంది. అలాగే అదనపు న్యాయమూర్తిగా పదవీ కాలాన్ని పొడిగించటం, పూర్తిస్థాయి హోదా కల్పించటం వంటి వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా 2022 ఫిబ్రవరి 12 నుంచి జిల్లా సెషన్స్ జడ్జిగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఆమె రాజీనామా చేసినట్టు, ఆ రాజీనామాను ఆమోదించినట్టు కూడా అధికారిక వర్గాలు తెలిపాయి. జనవరి 19న 12 ఏళ్ల బాలిక ఛాతీ భాగాన్ని ఓ వ్యక్తి తాకినా చర్మం తగలనందున లైంగిక వేధింపుల కిందకు రాదని జస్టిస్ పుష్ప తీర్పు వెలువరించారు. దుస్తుల పైనుంచి కాకుండా నేరుగా తాకితేనే లైంగిక వేధింపుల కిందకు వస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఐదేళ్ల బాలికపై జరిగిన లైంగిక వేధింపుల కేసులోనూ ఇలాంటి తీర్పునే ఇచ్చారు. బాలికల చేతులు పట్టుకోవడం, వారి ముందు మగవాళ్లు ప్యాంటు జిప్ విప్పుకోవడం వేధింపులు కావని తీర్పు ఇచ్చారు. పోక్సో చట్టం కింద వీటిని నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేశారు. ఈ తీర్పులు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa