(అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి) : ఉత్తరాంధ్ర జిల్లాలను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ప్రాంతంలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అందుబాటులో వున్న నదీ లాలు, భూగర్భ జలాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడం, రుూ ప్రాంత రైతాంగపు ఆదాయాన్ని పెంచడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతాంగానికి పలు వరాలను ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రకృతి వనరులైన జలం వంటి వాటిపై ప్రజల్లో ఆరాధన భావం కల్పించి వారిలో జలచైతన్యం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసిరికి హారతి కార్యక్రమాన్ని చీపురుపల్లిలో తోటపల్లి కుడికాల్వ వద్ద ముఖ్యమంత్రి బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా చీపురుపల్లి జి.వి.ఆర్.డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ ప్రకృతికే మూలం జలం అని పేర్కొంటూ మన పూర్వీకులు, పెద్దలు నదులను పూజించేవారు, ఆరాధించేవారని గుర్తు చేశారు. నదులను పూజించడం మన సంసృ్కతిలో ఒక భాగమన్నారు. నీటిపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సి వుందని, జల సంరక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ చైతన్య వంతులు కావలసి వుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నీటితోనే మన పిల్లల భవిష్యత్తు, వారికి భద్రత లభిస్తుందన్నారు. జలసిరికి హారతి కార్యక్రమాన్ని వచ్చే రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వున్న అన్ని పంచాయతీల్లో వున్న నీటి వనరుల్లో జరపాలని, ఇందులో అన్ని వర్గాలవారూ భాగస్వాములు కావాలన్నారు. ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి, సాగునీటికి సమస్యలు లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని దీనిలో భాగంగా నదుల అనుసంధానం, చెరువుల్లో పూడికతీత, గొలుసుకట్టు చెరువుల అనుసంధానం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నాగావళినిచంపావతి, సువర్ణముఖి, వంశధార నదులతో అనుసంధానం చేస్తామన్నారు. తోటపల్లి పాత ఆయకట్టు వ్యవ స్థను ఆధునీకరిస్తామని, తద్వారా ఆయకట్టు చివరి భూములకు సైతం సాగునీటిని అందిస్తామని, ఈ ఏడాదే రుూ పనులు చేపడతామన్నారు. తోటపల్లి కాల్వల ద్వారా ఈ ఏడాది 444 చెరువులను నీటితో నింపామని, జిల్లాలోని 9 వేల చెరువులకు నీటిని అందించడం ద్వారా వాటిని నింపాలనేది తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో జలవనరులు అధికంగా లభ్యమయ్యే జిల్లాల్లో విజయనగరం కూడా ఒకటని, ఈ జిల్లాలో నదుల్లో లభ్యమయ్యే నీటిని సద్వినియోగం చేసుకోవలసి వుందన్నారు. తద్వారా వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించే దిశగా కృషిచేయాల్సి వుందన్నారు. జిల్లాలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని, 3.5 మీటర్ల లోతులోనే జలాలు అందుబాటులోకి వస్తున్నాయని, వీటిని రైతాంగం వినియోగించుకొని రెండో పంట కూడా పండించి ఆదాయం సంపాదించాలన్నారు. జిల్లాలో భూగర్భ జలాలను పూర్తిస్థాయిలో వినియోగించేందుకు వీలుగా జిల్లాకు 25వేల బోర్లను, సౌరవిద్యుత్తు పంపుసెట్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే రీతిలో శ్రీకాకుళం జిల్లాకు కూడా మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. జిల్లా రైతాంగం వ్యవసాయ ఉత్పాదకతపై అధికంగా దృష్టి సారించాల్సి వుందని ముఖ్యమంత్రి కోరారు. పంట దిగుబడులు పెంచుకోవడం, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవలసి వుందన్నారు. దిగుబడులు పెంచుకొనేందుకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించుకోవలసి వుందన్నారు. మనలో చైతన్యం రావాలని, మన జీవితాలను బాగు చేసుకోవాలన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పేదలు అధికంగా వుంటారని, ఈ రెండు జిల్లాల ప్రజలు ఎంతో మంచివారని ముఖ్యమంత్రి కొనియాడారు. శాసనసభ్యురాలు డా.కిమిడి మృణాళిని కోరిన మేరకు చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సి.ఎం. పలు వరాలు ప్రకటించారు. చీపురుపల్లి పట్టణంలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు, కస్తూరిబా పాఠశాలను కళాశాల స్థాయికి పెంపుదల వంటి పలు వరాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంు్తల్రు కిమిడి కళావెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, ఆర్.వి.ఎస్.కె.రంగారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ డా.శోభా స్వాతిరాణి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనంజయ్ రెడ్డి, జలవనరుల కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కశింకోటలో...
అన్ని పండుగల కంటే ముఖ్యమైన పండుగ ‘జలసిరికి హారతి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖ జిల్లా కశింకోట మండలం నర్సాపురం గ్రామంలో ‘జలసిరికి హారతి’ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా శారదా నదికి హారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నర్సాపురం ఆనకట్టను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ మన జీవితాలకు వెలుగులు తెచ్చే పండుగ ‘జలసిరికి హారతి’. మన జీవన ప్రమాణాలు సక్రమంగా ఉండాలంటే ప్రకతిని ఆరాధించాలి. మనకు తిండినిచ్చే రైతులను గౌరవించడం మనందరి బాధ్యత. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛను రూ.వెయ్యికి పెంచాం. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలనే డ్వాక్రా సంఘాలు పెట్టాం. మహిళల కోసం దీపం పథకంతీసుకొచ్చాం. భవిష్యత్తులో 80శాతం ప్రజలు సంతోషంగా ఉండేలా పాలన అందిస్తాం. ప్రజలకు మేలు చేస్తున్న పార్టీలను అందరూ ఆదరించాలి’ అని అన్నారు.