రష్యాతో సై అంటే సై అంటున్న ఉక్రెయిన్ దేశాధినేత తమ పోరాటం ఎంతవరకో ఆయన తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ పార్లమెంటును సభ్యదేశాలు అత్యవసరంగా సమావేశపరిచాయి. ఈ సమావేశానికి ఈయూ సభ్యదేశాలతో పాటుగా రష్యా యుద్ధంతో శక్తివంచన లేకుండా పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో జెలెన్‌స్కీ చేసిన ప్రసంగానికి ఈయూ దేశాలు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాయి. ఈయూ సభ్య దేశాలు తమకు మద్దతుగా నిలిచే దిశగా చర్యలు చేపట్టాలన్న డిమాండుతో జెలెన్‌స్కీ ఈయూ పార్లమెంటుకు వెళ్లారు. రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా జెలెన్ స్కీ స్పష్టం చేశారు. రష్యాకు తమ సత్తా ఏమిటో చూపుతామని కూడా ఆయన శపథం చేశారు. ఈ పోరాటంలో తప్పనిసరిగా విజయం సాధించి తీరతామని చెప్పారు. రష్యా సేనలతో తమ దేశ పౌరులు ధైర్యంగా పోరాడుతున్నారని చెప్పారు. ఈ పోరాటంలో ఎంతదాకా అయినా వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. రష్యా బాంబు దాడుల్లో 16 మంది చిన్నారులు చనిపోయారని, తమ పిల్లలు క్షేమంగా జీవించాలన్నదే తమ కోరిక అని జెలెన్ స్కీ తెలిపారు. అసలు పుతిన్ లక్ష్యమేమిటని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ యుద్ధంలో ఈయూ సభ్య దేశాలు తమకు మద్దతుగా నిలబడతాయని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. జెలెన్‌స్కీ చేసిన ప్రసంగాన్ని ఆసాంతం ఆసక్తిగా విన్న ఈయూ సభ్య దేశాల ప్రతినిధులు..ప్రసంగం ముగియగానే... ఆయనకు లేచి నిలబడి మరీ చప్పట్లతో హర్షం వెలిబుచ్చారు. ఆ తర్వాత ఈయూ పార్లమెంటు అధ్యక్షురాలు మాట్లాడుతూ ఈయూ దేశాలన్నీ అండగా ఉంటాయని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa